శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (10:47 IST)

సంగీత దర్శకుడు 'శ్రీ' కన్నుమూత.. నేడు అంత్యక్రియలు..!

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు, సంగీత దర్శకుడు శ్రీ (49) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్, కొండాపూర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 'శ్రీ' పూర్తి పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. 

శ్రీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. అంతిమయాత్రకు సన్నిహితులు, అభిమానలు పెద్దసంఖ్యలో తరలివచ్చేందుకు రెడీ అవుతున్నారు. కొండాపూర్‌లోని నీహారిక అపార్ట్‌మెంట్స్‌ నుంచి శ్రీ అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబసభ్యులు చెప్పారు.
 
ఆయన ‘పోలీస్ బ్రదర్స్’ సినిమాతో సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మనీ మనీ, సింధూరం, అనగనగా ఒకరోజు, ఆవిడా మా ఆవిడే, గాయం, అమ్మోరు తాడిత సినిమాలు ఆయనకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన తన ప్రతిభను నిరూపించుకొన్నప్పటికీ సినీ పరిశ్రమలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పలేదు.
 
ఆయన మంచి నేపద్య గాయకుడు కూడా. చక్రం, గాయం, అమ్మోరు సింధూరం సినిమాలలో ఆయన పాడిన పాటలు ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆయన కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. సాయిరామ్ శంకర్ నటించిన 143సినిమాలో సాయిరామ్ కు ఆయనే డబ్బింగ్ చెప్పారు.
 
కాగా గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ నటులు, సంగీత దర్శకులు, నిర్మాతలు అకాల మరణం చెందుతుండటంతో తెలుగు ప్రజలు, సినీ పరిశ్రమలో వ్యక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ దోష నివారణ కోసం సినీ పరిశ్రమలో వారు మాహా మృత్యుంజయ హోమం కూడా చేశారు. అయినప్పటికీ సినీ పరిశ్రమను మృత్యుదేవత నీడలా వెంటాడుతూనే ఉంది.