1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (17:38 IST)

పటాస్ సూపర్ టైమ్‌పాస్: రివ్యూ రిపోర్ట్!

సినిమా: పటాస్‌
తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, శృతి సోది, సాయికుమార్‌, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ రెడ్డి, పృధ్వీ, ‘ప్రభాస్‌’ శ్రీను తదితరులు
బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌ రామ్‌
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: జనవరి 23, 2015
 
‘అతనొక్కడే’ తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మరోసారి కొత్త దర్శకుడిపై నమ్మకం ఉంచి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ‘అతనొక్కడే’తో సురేందర్‌ రెడ్డిలాంటి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసిన కళ్యాణ్‌ రామ్‌ ఇప్పుడు అనిల్‌ రావిపూడితో మరో నమ్మకం పెట్టుకోతగ్గ దర్శకుడిని తన బ్యానర్‌ నుంచి పరిచయం చేసాడు. ట్రెయిలర్స్‌తోనే ‘పటాస్‌’ ఉంది అనిపించిన ఈ చిత్రం ఆద్యంతం సూపర్‌గా సాగిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ లవర్స్‌కి ఫుల్‌ డోస్‌ ఇచ్చింది. 
 
కథేంటి? 
కళ్యాణ్‌ సిన్హా (కళ్యాణ్‌ రామ్‌) ఏసీపీగా ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి.. తన కింద పని చేసే పోలీసులని కూడా అవినీతికి పాల్పడమని ఎంకరేజ్ చేస్తాడు. తప్పులు చేసే వాళ్లతో జత కలిసి తన షేర్‌ తను తీసేసుకుంటూ వుంటాడు. 
 
అయితే ఓవైపు టీవీ జర్నలిస్టు అయిన మహతిని (శృతి సోది) ప్రేమించమంటూ వెంట పడుతూనే, మరోవైపు సిన్సియర్‌గా పనిచేసే డిజిపిని (సాయికుమార్‌) టీజ్‌ చేస్తుంటాడు. పోలీసులంటే పడని రాజకీయ నాయకుడు జి.కె. (అశుతోష్‌ రాణా)చేసే అకృత్యాలకి కూడా ఊతమిస్తుంటాడు. కరప్ట్‌ ఆఫీసర్‌ అయిన కళ్యాణ్‌ సిన్హా తనని తాను ఎలా కరెక్ట్‌ చేసుకుంటాడు, జీకేకి ఎలా బుద్ధి చెప్తాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
హైలైట్స్‌: 
ఎంటర్‌టైన్‌మెంట్‌
హీరో-విలన్‌ ఛాలెంజ్‌ చేసుకునే సీన్స్‌
వేగవంతమైన కథనం
 
డ్రాబ్యాక్స్‌: 
సాంగ్స్‌
హీరోయిన్‌
క్లైమాక్స్‌


 
విశ్లేషణ: 
రొటీన్‌ కథనే తీసుకుని ఆకట్టుకునేలా చెప్పడమే కమర్షియల్‌ సినిమా దర్శకులకి మాత్రమే తెలిసిన కళ. సరికొత్త కథాంశం కానీ, కథనం కానీ లేకుండానే... రొటీన్‌ ఎలిమెంట్స్‌తో రెగ్యులర్‌ సినిమా తీసి మెప్పించారు. కమర్షియల్‌ సినిమా తీసే ఆర్టు తన దగ్గర బాగా ఉందని యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి చాటుకున్నాడు. 
 
పక్కదారి పట్టిన పోలీసు.. తన తప్పు తెలుసుకుని దుష్టులకి బుద్ధి చెప్పడమనే పరమ రొటీన్‌ పాయింట్‌తో రూపొందిన ‘పటాస్‌’ని అల్లాటప్పాగా తీస్తే తుస్‌మనేసేది. కానీ దర్శకుడు అనిల్‌ రావిపూడి తన మామూలు కథని వినోదాత్మకంగా చెప్పడంలో సక్సెస్‌ అయ్యాడు. 
 
కామెడీ ప్రధానంగా సాగిపోతున్న చిత్రం ఇంటర్వెల్‌ దగ్గరకు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. అంతవరకు తను చేసే బాధ్యతాయుత ఉద్యోగాన్ని తేలిగ్గా తీసుకుంటూ కనిపించిన హీరో ఆ తర్వాత తన యూనిఫామ్‌ పవరేంటో చూపిస్తాడు. ఈ క్రమంలో కావాల్సినంత ఎమోషన్‌ పండింది. హీరో ఎలివేషన్‌ సీన్స్‌ తప్పకుండా టార్గెట్‌ ఆడియన్స్‌ని అమితంగా అలరిస్తాయి. 
 
సాయికుమార్‌-కళ్యాణ్‌రామ్‌ మధ్య మరికాస్త ఎమోషన్‌ పండించినట్టయితే ఇంకా సినిమాకు హైలైట్ అయ్యేది. అది మిస్సింగ్. అలాగే హీరోయిన్‌ ట్రాక్‌ కాసేపు వినోదానికి వాడుకున్నారు. కానీ తర్వాత సైడ్‌ ట్రాక్‌ అయింది. ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్‌ని కూడా ఫిల్‌ చేసినట్టయితే ‘పటాస్‌’ ఇంకా బాగా పేలి ఉండేది. వినోదం ఎక్కడా మిస్‌ అవకపోవడం, కథనం వేగంగా పరుగులు తీయడం దీనికి పెద్ద ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచాయి.
 
క్లయిమాక్స్‌ని మరీ సింపుల్‌గా తేల్చేసినట్టు అనిపిస్తుంది. లాస్ట్‌ సీన్‌లో ఉండాల్సినంత ఎమోషన్‌ లేకపోవడం ఖచ్చితంగా లోటే. ఇంటర్వెల్‌ ముందు నుంచి, ఇంటర్వెల్‌ తర్వాత ఒక నలభై నిముషాల వరకు సినిమా గ్రాఫ్‌ టాప్‌ లెవల్‌లో ఉంటుంది. అదే ఈ చిత్రానికి మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది. 
 
మాస్‌ మసాలా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులని ‘పటాస్‌’ శాటిస్‌ఫై చేస్తుంది. అలాగే నందమూరి అభిమానులకి పటాస్ తప్పకుండా నచ్చుతుంది. మొత్తానికి పటాస్ అభిమానులకు ఫుల్‌ టైమ్‌ పాస్‌..!!

రేటింగ్ : 3/5