శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (13:12 IST)

నట కిరీటికి కేసీఆర్ అభినందన: రాజేంద్రుడు తొందరపడుతున్నాడా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాజా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
 
ఇదిలా ఉంటే నటుడు రాజేంద్రప్రసాద్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా ఆదివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. మురళీమోహన్‌ ఆయన చేత ప్రమాణ పత్రంలో సంతకం చేయించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు కూడా ప్రమాణ పత్రాలు అందజేశారు. 
 
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం 50మంది పింఛనుదారులు వున్నారనీ, వారికి వెంటనే పింఛను అందజేసేందుకు చర్యలు తీసుకుంటానని.. సోమవారం నుంచి వాటిపై దృష్టి పెడతానని అన్నారు. అదేవిధంగా ''మా'' నిధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇంకోవైపు.. సభ్యులందరికీ మెడిక్లెయిమ్‌లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
కాగా, ఫిలింఛాంబర్‌లోని మా కార్యాలయంలోని అధ్యక్షునికి ప్రత్యేక ఛాంబర్‌ వుండేది. గాజుతో తయారుచేసిన ఆ ఛాంబర్‌ను తొలగించి, ప్రతి సభ్యుడు తనను వచ్చి కలిసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, మా సభ్యత్వ రుసుమును తగ్గిస్తానని ప్రకటించారు. 
 
ఇకపోతే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.... దీని సాధ్యాసాధ్యాలు గురించి కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒక వేళ తగ్గిస్తే... ఇంతకుముందు సభ్యులుగా వున్న వారు దాన్ని వ్యతిరేకించే అవకాశం వుంది. ఇది సాధ్యమయ్యేపని కాదనీ, ఆయన తొందరపాటుగా ప్రవర్తిస్తున్నారని సభ్యులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబుతో పాటు పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. మరి రాజేంద్రప్రసాద్ తొందరపాటుగా ప్రవర్తిస్తున్నారా.. లేకుంటే మా సంక్షేమం కోసం వెంటవెంటనే నిర్ణయం తీసుకుంటున్నారా..? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.