గురువారం, 16 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 25 సెప్టెంబరు 2014 (18:59 IST)

మహేష్‌ బాబు, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో చిత్రం... ఇరగదీస్తుందట....

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తెలుగు కథానాయకుడు మహేష్‌ బాబుల కలయికతో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌తో గతంలో 'రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌', 'మేరా అదాలత్‌', 'మహాగురు' చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత యు. సూర్యనారాయణబాబుకు రజనీకాంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహేష్‌బాబు కూడా రజనీకాంత్‌తో కలిసి నటించేందుకు తన అంగీకారాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
ఈయన గతంలో కృష్ణ, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో 'అన్నదమ్ముల సవాల్‌' చిత్రాన్ని నిర్మించారు. మహేష్ బాబుతో శంఖారావం, బజారురౌడీ చిత్రాలను కూడా రూపొందించారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 30 చిత్రాలకుపైగా నిర్మించిన ఈయన కృష్ణంరాజు హీరోగా 'మనుషులు చేసిన దొంగలు' చిత్రంతో నిర్మాతగా ప్రవేశించారు. 'అల్లుడు దిద్దిన కాపురం' తర్వాత నిర్మాణం చేపట్టలేదు. అంతేకాకుండా కృష్ణగారికి దగ్గరి బంధువు కూడా. మహేష్‌కు మేనమామ అవుతారు. అంతేకాకుండా కోదండరామిరెడ్డిని 'సంధ్య' చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయం చేసిన ఘనత ఈయనదే.
 
కాగా, మంగళవారంనాడు హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో వున్న రజనీకాంత్‌ను సూర్యనారాయణబాబు కలిశారు. రజనీకాంత్‌ చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేసి నిర్మాతగా మారి ప్రస్తుతం తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డితో ఆయన కలిసి వెళ్ళారు. కుశల ప్రశ్నల అనంతరం సినిమాల ప్రస్తావన రావడంతో 'మీరు సరేనంటే మీతో చిత్రం చేస్తానని' చెప్పడంతో రజనీకాంత్‌ పాజిటివ్‌గా స్పందించారు. 'లింగా' చిత్రం పూర్తయిందనీ, 'కొచ్చాడియాన్‌' చిత్రాన్ని నిర్మించిన యూరోన్‌ పిక్చర్స్‌ (ముంబై) వారికి మరో చిత్రం చేసిన తర్వాత మీకు చిత్రాన్ని చేయడానికి అభ్యంతరం లేదనీ, నాడు కృష్ణగారితో కలిసి చేసిన మల్టీస్టారర్‌ చిత్రంగా వుంటే బాగుంటుందని రజనీకాంత్‌ సూచించారు. ఈ విషయాన్ని మహేష్‌కు చెప్పడం ఆయన సమ్మతించడం జరిగింది.
 
ఈ విషయాన్ని నిర్మాత సూర్యనారాయణబాబు ధృవీకరిస్తూ... రజనీకాంత్‌, మహేష్‌ బాబుల డేట్స్‌కు అనుకూలంగా చేసేందుకు సిద్ధమే' అన్నారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ... వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ రూపొందేందుకు పరిస్థితులు అనుకూలించడం సంతోషదాయకం' అన్నారు. ఈ చిత్రం కొత్త ఒరవడికి నాంది పలుకుతుందన్నారు.