'గబ్బర్ సింగ్' కోసం కుర్రపిల్లను ఫిక్స్ చేసిన హరీశ్ శంకర్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ విరామం తర్వాత వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం పింక్‌ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా సింహ భాగం పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా వాయిదావేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం వచ్చే దసరా లేదా దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ఓ చిత్రాన్ని తెరెక్కించనున్నారు. ఇందులో పవన్ హీరో కాగా, హీరోయిన్ కోసం దర్శకుడు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్‌లలో శోధించి, చివరకు మానస రాధాకృష్ణన్ అనే హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
కేరళలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. దుబాయ్‌లో పెరిగింది. ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో 'పరమగురు' సినిమా చేస్తోంది. పవన్‌తో చేసే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
నిజానికి తెలుగు వెండితెరపై మలయాళ బ్యూటీలు రాజ్యమేలుతున్నారని చెప్పొచ్చు. నయనతార, కీర్తిసురేష్, అమలాపాల్, ఇలా అనేక మంది తారలు రాణిస్తున్నారు. ఈ భామలు అందం .. అభినయంతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమ హవాను సాగిస్తున్నారు. ఈ కోవలోనే మానస రాధాకృష్ణన్ కూడా తెలుగు తెరకు పరిచయంకానంది.