బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:09 IST)

పవన్ ఇకపై సినిమాలు చేయాలనుకోవడం లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లడం... ఆ తర్వాత అభిమానులు పవన్‌ని సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయడం తెలిసిందే. ఒకానొక సందర్భంలో అన్నయ్య చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం మానద్దు అని సలహా ఇచ్చారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఏంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటే... బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మే 15న వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇంతలో.. షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. మే 15న రిలీజ్ చేయాలనుకున్న వకీల్ సాబ్ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. 
 
ఈ సినిమానే కాదు.. మొత్తం అన్ని సినిమాల పరిస్థితి ఇలానే ఉంది. దీంతో పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వకీల్ సాబ్ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
 
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నటించాలి. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ఎ.ఎం.రత్నం ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బస్టర్ మూవీని అందించిన హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నారు. 
 
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఇయర్ ఎండింగ్‌లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే... పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి కొత్త చిత్రాలకు సైన్ చేయకూడని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కోసం అనేక మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఆయన ఓకే అంటే ఆయనతో సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. 
 
అయితే... పవన్ మాత్రం కొత్త చిత్రాలకు సంబందించి ఎవరికీ ఓకే చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల వలన ఒప్పుకున్న చిత్రాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో.. కొత్త సినిమాలు ఒప్పుకొని లాకై పోతే రాజకీయ కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇబ్బంది కావచ్చే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.