శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 22 మే 2016 (16:12 IST)

శ్రీవారితో పోల్చినందుకే 'బ్రహ్మోత్సవం' సినిమా ఫెయిల్‌ అయ్యిందా!.. భక్తులేమంటున్నారు?

తిరుమల శ్రీవేంకటేశ్వస్వామి.. ప్రపంచంలోని హిందువులందరికీ ఆరాధ్యదైవం. స్వామివారి 'బ్రహ్మోత్సవం' అంటే అంతా ఇంతా కాదు. బ్రహ్మోత్సవం వచ్చిందంటే అతి ఒక పెద్ద పండుగే. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వస్తుంటారు. స్వామివారికి జరిగే వాహన సేవలను తిలకించి.. పులకించి పోతుంటారు. 
 
అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగింది 'బ్రహ్మోత్సవం'. అలాంటి పేరును వాడేటప్పుడు ఎంతో ఆచితూచి అడుగులు వేయాలి. అయితే 'బ్రహ్మోత్సవం' పేరుతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. గతంలో ఒక కుటుంబ కథా చిత్రాన్ని తీసిన శ్రీకాంత్‌ అడ్డాల అదే పంథాతో తీయాలని చూశాడు. అది కూడా శ్రీవారిని పోలుస్తూ ఒక క్యాప్షన్‌ కూడా పెట్టారు. సినిమా పేరు బయటకు రాగానే అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం వచ్చింది. 
 
అయితే మొదట్లో ఈ పేరును పెట్టేందుకు కొంతమంది సినీ పరిశ్రమలో వారే ఒప్పుకోలేదు. 'బ్రహ్మోత్సవం' గురించి దర్శకుడి దృష్టికి చాలామంది తీసుకెళ్ళారు. అయితే తనపై తనకున్న నమ్మకంతో శ్రీకాంత్‌ అడ్డాల 'బ్రహ్మోత్సవం' సినిమాను పూర్తి చేశాడు. అసలు వందల సంవత్సరాలుగా అతి ఎత్తైన కొండల్లో, దట్టమైన అడవుల్లో ఉన్న ప్రాభవాన్ని చాటుకుంటున్న తిరుమల వెంకన్న చరిత్ర అంతా ఇంతా కాదు. 
 
ప్రతి నిత్యం దేవతలు, ఋషులు సూక్ష్మరూపులై స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే మహిమాన్వితమైన ప్రదేశం తిరుమల. అలాంటి తిరుమల శ్రీవారి పరకామణితో పోలికగా 'బ్రహ్మోత్సవం' సినిమాను తీశారు. ముడుపు కట్టుకుని, ఏడుకొండలు నడిచివచ్చి వడ్డికాసులు వాడికి మొక్కు చెల్లిస్తుంటారు. మానవాతీతమైన శక్తితో మనల్ని పోల్చుకుంటే ఉపద్రవాలు తప్పవని, గతంలో తిరుమల గురించి మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారో గతంలో చూసిన సంఘటనలు ఉన్నాయి.
 
 
మరో ప్రధానమైన విషయమేమిటంటే ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో విజయనిర్మల కుమారుడు, హీరో నరేష్‌ మాట్లాడుతూ 'బ్రహ్మోత్సవం' సినిమా కలెక్షన్లు తిరుమల వేంకటేశ్వరస్వామి ఏడాది హుండీ ఆదాయాన్ని మించిపోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు ఈ విధంగా చేయనేలేదు. 
 
అయితే స్వామివారికే సవాల్‌ చేస్తూ సినిమాను తీయడం వల్లనే ఈ విధంగా జరిగిందని భక్తులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమా ఫెయిల్‌ అన్న విషయం పరిశ్రమలో పెద్ద హాట్‌ టాపిక్‌గా మారితే శ్రీవారిని హుండీ గురించి మాట్లాడటం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది మరో చర్చకు దారితీస్తోంది.