శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (21:31 IST)

జగ్గూబాయ్ సంచలన నిర్ణయం.. ఎవ్వరు ఏమి తీసుకెళ్లరు.. బూడిద తప్ప!

టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన 60వ పుట్టినరోజును సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో జరిగిన అవయవదాన అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. "మనిషిగా పుడతాం.. మనిషిగా పోతాం.. వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏమి తీసుకెళ్లరు.. ఒక్క 200 గ్రాముల బూడిద తప్ప ఏమి మిగలదు. దానికోసం ఈ జీవితం మొత్తం పరిగెడుతూనే ఉంటాం. ఈ అవయవ దానం ద్వారా మనం చనిపోయినా మరో 7, 8 మందికి పునర్జన్మ ఇవ్వవచ్చు" అంటూ పేర్కొన్నారు. 
 
జగ్గూభాయ్ ఇంకా మాట్లాడుతూ.."నేను సినిమాలో హీరో అయినా, విలన్ అయినా నిజజీవితంలో హీరోలాగే బతకాలనుకుంటున్నాను. హీరోలాగే నా అవయవాలను దానం చేస్తున్నాను. కళారంగంలో సేవ చేసిన వారికి పద్మశ్రీ, పద్మ భూషణ్ లను ఇచ్చి సత్కరించినట్లు అవయవదానం చేసిన వారికి కూడా పద్మశ్రీ ఇవ్వాలి" అంటూ జగపతి బాబు తెలిపారు. 
Jagapathi Babu
 
ఇక ఈ నిర్ణయం తీసుకున్న జగపతిబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.  ప్రస్తుతం జగపతి బాబు టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒకరకంగా టాలీవుడ్‌కు సంబంధించి ఇలా అవయవ దానం చేసిన అతి కొద్దిమంది నటులలో ఆయన కూడా చేరారు. టాలీవుడ్‌లో జగపతిబాబు మాత్రమే కాక హీరో నవదీప్, హీరోయిన్ సమంత, దర్శకుడు రాజమౌళి కూడా తన మరణానంతరం తన అవయవాలు దానం చేయాలని అవయవదానం కార్యక్రమంలో చేరారు.