శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (11:36 IST)

కారు ప్రమాదం ఎలా జరిగిందంటే.. శబ్దానికి చెవులు వినిపించలేదు.. కళ్ళు కనిపించలేదు... రాజ్ తరుణ్

హైదరాబాద్ నగరంలోని నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు (బాహ్య వలయాకార రహదారి)లో జరిగిన రోడ్డు ప్రమాదంపై టాలీవుడ్ యుహ హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను పరుగెత్తుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్టు చెప్పారు.
 
ఈ ప్రమాదంలో ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. 'నార్సింగ్ సర్కిల్‌లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారుపై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్ధానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. పైగా, సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని సూచించాడు.