1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (10:02 IST)

నిర్మాతల మండలి ఎన్నికల బరిలో విశాల్... మద్దతు తెలిపిన కమల్‌హాసన్

తమిల చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో కోలీవుడ్ యువ హీరో విశాల్ నిలిచారు. ఆయనతో పాటు.. ఆయన వర్గానికి చెందిన పలువురు పలు పదవులకు పోటీ చేయనున్నారు. నిర్మాతల మండలి ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను కోర్టు ఉ

తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో కోలీవుడ్ యువ హీరో విశాల్ నిలిచారు. ఆయనతో పాటు.. ఆయన వర్గానికి చెందిన పలువురు పలు పదవులకు పోటీ చేయనున్నారు. నిర్మాతల మండలి ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను కోర్టు ఉత్తర్వుల మేరకు ఎత్తివేయడంతో విశాల్‌ మరోసారి ఎన్నికల బరిలో దిగారు. ఇందులోభాగంగా శనివారం మధ్యాహ్నం అధ్యక్ష పదవికి విశాల్‌ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నిర్మాతలు ప్రకాష్‌ రాజ్‌, పాండిరాజ్‌, మిష్కిన్, జ్ఞానవేల్‌రాజా, ఎస్‌ఆర్‌ ప్రభు, సీవీ కుమార్‌, ఎస్‌ఎస్‌ కుమరన్, ఆర్‌కే సురేష్‌ తదితరులు ఉన్నారు.
 
అలాగే విశ్వనటుడు కమల్‌హాసన్ కూడా విశాల్‌కు మద్దతు పలకడంతో మరోసారి సినీ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం కనిపించే సూచనలు కన్పిస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు విశాల్‌ దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో కమల్‌హాసన్ సంతకం కూడా చేశారు. గతేడాది నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ ప్రధాన కార్యదర్శిగా బరిలోకి దిగి విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. అదే తరహాలో నిర్మాతల మండలిలోనూ తన సత్తా చాటాలని విశాల్‌ ఎదురుచూస్తున్నారు. 
 
వచ్చే నెల 5వ తేదీన మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్వరన్ పర్యవేక్షణలో నిర్మాతల మండలి ఎన్నికలు చెన్నైలో జరుగనున్నాయి. కార్యవర్గంపై అసంతృప్తితో ఉన్న నిర్మాతలతో కలిసి విశాల్‌ ప్రత్యేక కూటమిని ఏర్పాటుచేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు కలైపులి ఎస్‌.థాను, రాధాకృష్ణన్, విశాల్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. విశాల్‌ వర్గం తరపున అధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్టు ప్రకటించిన నటి ఖుష్బూ తాజా పరిణామాలతో రేసు నుంచి తప్పుకొన్నారు. ఆమె కార్యదర్శి లేదా కోశాధికారి పదవికి పోటీ చేసే అవకాశం ఉంది.