శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (08:53 IST)

సినిమా చూసేందుకు డబ్బులివ్వలేదనీ తండ్రిపై పెట్రోల్ పోసి...

తమిళనాడు రాష్ట్రంలో హీరో అజిత్ వీరాభిమాని ఒకరు అత్యంత దారుణ చర్యకు పాల్పడ్డాడు. తన హీరో చిత్రాన్ని చూసేందుకు డబ్బులు ఇవ్వని కన్నతండ్రిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేసేందుకు యత్నించాడు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
హీరో అజిత్ తాజా చిత్రం "విశ్వాసం" గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తొలి రోజే చూడటం అతని వీరాభిమాని అయిన వేలూరుకు చెందిన అజిత్ కుమార్ అనే యువకుడు అలవాటు. అలాగే, 'విశ్వాసం' చిత్రాన్ని కూడా చూడాలని భావించాడు. 
 
కానీ, చేతిలో డబ్బులు లేకపోవడంతో తన తండ్రి పాండ్యరాజన్‌ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. ఆయన డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన అజిత్ కుమార్ తండ్రి పాండ్యరాజన్‌పై పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు యత్నించాడు. ఈ ఘటనలో పాండ్యరాజన్ ముఖం కాలిపోవడంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అజిత్ కుమార్‌ను అరెస్టు చేశారు.