ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:46 IST)

వ్యాక్సిన్ వేయించుకోండి... కరోనా వచ్చినా ఏమి చేయదు : అల్లు అరవింద్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఈయనకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అలాగే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. 
 
అయితే ఆయన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా పాజిటివ్ అని వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అల్లు అరవింద్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై తాను ఇపుడు వివరణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. 
 
"ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నాక, ముగ్గురు స్నేహితులం ఊరెళ్లాం. తిరిగొచ్చిన తర్వాత నాకు, మరో వ్యక్తికి స్వల్పంగా జ్వరం వచ్చింది. మరో మిత్రుడు ఆసుపత్రిపాలయ్యాడు. వ్యాక్సిన్ తీసుకున్న నేను, మరో వ్యక్తి తేలికపాటి జ్వరానికి గురయ్యాం. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి మాత్రం ఆసుపత్రిలో చేరాడు. 
 
దీన్ని బట్టి నేను చెప్పేదేంటంటే... వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల ప్రాణహాని ఉండదు. కరోనా ప్రభావం కూడా మనిషి శరీరంపై ఏమంత ఎక్కువగా ఉండదు. వైరస్ వచ్చి పోతుందంతే. వ్యాక్సిన్ వేయించుకోబట్టే నాకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరంలేకపోయింది. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి. అప్పుడు కరోనా వచ్చినా ఏమీ చేయదు" అని వివరించారు.