శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (18:10 IST)

నట్టికుమార్ పిటిషన్ పై ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఉత్తర్వులు

Natti kumar
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను అక్కడి కొంతమంది థియేటర్స్ యజమాన్యాలు అమలుపరచకుండా తమ ఇస్టానుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్నారు. దానివ‌ల్ల‌ ప్రేక్షకుల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారంటూ, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తక్షణమే ఈ అన్యాయం, దోపిడీపై చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఏపీలోని అమరావతి హైకోర్టుకెక్కారు.

35 రూపాయల టిక్కెట్లను కొంతమంది థియేటర్స్ యాజమాన్యాలు 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారని, ఈ బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎం.ఆర్. ఓ. ఆర్డీవో స్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తాను కోర్టుకె క్కానని నట్టికుమార్ వెల్లడించారు. ఈ బ్లాక్ మార్కెట్ కారణంగా కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోందని ఆయన వివరించారు. దీనిపై తాను కోర్టుకు వెళ్లడంతో కోర్టులో వాదనలు జరిగాయని ఆ మేరకు శనివారం హైకోర్టు జీవో 35 పై పూర్తి వివరాలకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ ను నాలుగు వారాల్లోగా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని నట్టికుమార్ మీడియాకు తెలిపారు. 
 
ఏపీ సీఎంకు నట్టికుమార్ విజ్ఞప్తి 
జీవో 35 చిన్న సినిమాలకు వరంగా ఉందనీ అయితే మీరు ఎంతో మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన ఆ జీవోను కొంతమంది మంది థియేటర్ యాజమాన్యాలు అమలు పరచకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రేక్షకుల డబ్బును దోచుకుంటున్నారని కొందరు స్థానిక అధికారులు కూడా దీనికి సహకరిస్తున్నందువల్ల దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి నిర్మాత నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.