సినిమా రంగంలో విజయవంతంగా కెరీర్‌ను కొనసాగించడం అంత తేలిక కాదు. అదీ పాతికేళ్ల ప్రస్థానమంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు అందరినీ అలాంటి ఆశ్చర్యానికి గురిచేస్తున్న వ్యక్తి బాలాదిత్య. బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బాలాదిత్య హీరోగానూ మంచి సినిమాలు చేశారు. మరోవైపు అనువాద కళాకారుడిగా, వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. గేయరచయితగా కూడా తనకున్న ప్రతిభను నిరూపించుకున్నారు.
"ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం" సినిమాతో బాలనటుడిగా సినీ రంగానికి పరిచయమయ్యారు బాలాదిత్య. తండ్రికి తగ్గ కొడుకుగా, పిసినారి పిల్లాడిగా, నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటనను అనుకరిస్తూ, ఆయనకు ఎదురుగా నిలబడి నటించి ఆయన చేత "స్టాంపు" అని పిలిపించుకున్న చిచ్చరపిడుగు బాలాదిత్య. ఆ చిత్రం తర్వాత "అన్న", "లిటిల్ సోల్జర్స్", "బంగారు బుల్లోడు", "హిట్లర్", "అబ్బాయిగారు", "ఏవండీ ఆవిడ వచ్చింది", "హలో బ్రదర్" వంటి చిత్రాల్లోనూ బాల నటుడిగా మెప్పించారు.
జయ. బి దర్శకత్వంలో "చంటిగాడు" చిత్రంతో హీరోగా పరిచయమైన బాలాదిత్యకు ఆ సినిమా మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత `రూమ్ మేట్స్`, "1940లో ఒక గ్రామం" వంటి చిత్రాలు కూడా చక్కటి పేరు తెచ్చి పెట్టాయి.
వి.మధుసూదనరావు, దాసరి నారాయణరావు, కె.బాలచందర్, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి, గుణ్ణం గంగరాజు, తమ్మారెడ్డి భరద్వాజ, బి.గోపాల్, జయ.బి., ఏవీయస్ వంటి దర్శకులతో పనిచేసిన ఘనత ఈ హీరోది.
అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, రజనీకాంత్, జితేంద్ర, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్, నాగార్జున, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, రాజశేఖర్, జగపతిబాబు, జూ.ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించిన అనుభవం ఉంది బాలాదిత్యకు. బాల నటుడిగా 40 చిత్రాల్లో, హీరోగా 10 చిత్రాల్లో నటించారు. ఆరేళ్లకు బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ నటుడు ''అన్న", ''లిటిల్ సోల్జర్స్" చిత్రాలకు నంది అవార్డు అందుకున్నారు.
18 ఏళ్లకే హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన నటించిన "1940లో ఒక గ్రామం" చిత్రానికి నేషనల్ అవార్డు రావడం గమనార్హం. ఈ సందర్భంగా తన పాతికేళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నారు బాలాదిత్య.