నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేసింది. ముందుగానే సినిమాపై నమ్మకంతో గురువారం నాడు బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
నాగార్జున మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సినిమా ప్రేక్షకులు ఫెవికాల్‌లా అతుక్కుని ఉంటారు. అలాంటి సంక్రాంతికి మన సినిమా లేకపోతే ఎలా. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నేను ఎంత పట్టుబట్టానే నా టీం ఎక్కువగా పట్టుబట్టింది. ఈ సినిమాలో నేను, చై మీసం తిప్పుతాం. రేపు మీరు (ఆడియెన్స్) కూడా సినిమా చూసి మీసం తిప్పుతారు. వాసివాడి తస్సాదియ్యా. నా ఎడిటర్ విజయ్ మూడు నెలలుగా నిద్రకూడా పోలేదు. జునైద్ చేసిన వీఎఫ్ఎక్స్ చేసిన పనిని ఎప్పటికీ మరిచిపోను. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కథలో భాగంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. యువరాజ్ నా డైమండ్. ఆయన లేకపోతే ఇదంతా జరిగేది కాదు. అనూప్ లడ్డుండా వంటి అద్బుతమైన పాటలు ఇచ్చాడు. బ్రహ్మ కడలి మాత్రం టైంకి సెట్‌లో వేసి ఇచ్చాడు. ఇంత అద్బుతమైన స్క్రిప్ట్ ఇచ్చిన కళ్యాణ్‌కి థ్యాంక్స్. ఇంత పెద్ద సినిమా, ఇంత మంది ఆర్టిస్ట్‌లను హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. నవ్వుతూనే అందరితో పని చేయించుకున్నాడు. జీ స్టూడియోస్ ప్రసాద్ ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్. మా సర్పంచ్ నాగలక్ష్మీ ఇక్కడ లేదు. కానీ అద్బుతంగా నటించింది. కొత్త నాగ చైతన్యను ఈ సినిమాలో చూస్తారు. చాలా బాగా నటించాడు. కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయి నటించాడు. బ్లాక్ బస్టర్ సక్సెస్ పార్టీ రోజు అందరి గురించి చెబుతాను. పర్మిషన్ లేకపోవడంతో ఎక్కువ మందిని పిలవలేకపోయాను. సక్సెస్ మీట్‌లో అందరినీ కలుద్దాం అని అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.. రారండోయ్ వేడుక సినిమాలో శివ పాత్రతో అందరికీ దగ్గర చేశాడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాతో మరింత చేరువయ్యేలా చేశాడు. ఆ సినిమాలో బీచ్ సీన్‌లో ఉన్న ఎనర్జీ ఇందులో ప్రతీ సీన్‌లో కనిపిస్తుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రారంభిస్తున్నాం.. సంక్రాంతికి రాగలుగుతామా? అని నాన్నను అడిగాను. నన్ను నమ్మురా? అని అన్నారు. అంతే సినిమా ఇప్పుడు రెడీ అయింది. రమ్యకృష్ణ, కృతి శెట్టి అద్భుతంగా నటించారు. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరూ బాగా నటించారు. అనూప్, డీఓపీ యువరాజ్, కొరియోగ్రఫర్స్ అందరికీ థ్యాంక్స్. ఇంత సపోర్ట్ చేసిన జీ టీవీ ప్రసాద్ గారికి థ్యాంక్స్. ఇది నిజంగానే పండుగలాంటి సినిమా. అందుకే ఈ సినిమాను నాన్న డిజైన్ చేశారు. మీరంతా తీర్పు ఇచ్చాకే మా పండుగ మొదలవుతుంది. థియేటర్ నుంచి వాసివాడి తస్సాదియ్యా అని అరుస్తూ బయటకు రండి. అందరూ కరోనా నిబంధనలు పాటించండి. ట్రైలర్ అందరికీ నచ్చిందా? తప్పకుండా సినిమా నచ్చుతుంది అని అన్నారు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. వన్ అండ్ ఓన్లీ సోగ్గాడు నాగార్జున గారే. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తి అవుతుందని మాకు నమ్మకం ఉంది. కానీ మా నమ్మకం నాగ్ సర్. ఆయన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వంద సార్లు ఆలోచించి తీసుకుంటారు. మా అందరినీ ఓ దండలా ఒకచోటకు తీసుకొచ్చి కూర్చారు. ఆయనే మా కెప్టెన్. ఆయన చూపించిన దారిలోనే నడిచాం. ఆయన లేకపోతే ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సినిమా రావడం చాలా కష్టం. సంక్రాంతికి రావాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆయన దిశానిర్దేశంలో పని చేశాం. అనుకున్న టైంకు రావడం సంతోషంగా ఉంది. బంగార్రాజు పాత్ర ఆయన కోసమే పుట్టింది. ఓ చిన్న పాప బంగార్రాజును ఎందుకు పంపించారు? అని అడిగింది. ఆ పాత్రతో చిన్న పిల్లలు కూడాప్రేమలో పడిపోయారా? అని అనిపించింది. అందుకే ఈ సీక్వెల్ చేయాలనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయనలో ఓ సరసం ఉంటుంది. రమ్యగారితో ఓ నవ్వు నవ్వుతారు. అది నాకు చాలా ఇష్టం. నేను ఈ రోజు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నానంటే దానికి నాగార్జున గారే కారణం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో కొంత మంది దర్శకుడిగా ఇద్దామని అనుకున్నారు. కానీ అవి కుదర్లేదు. నన్ను వంద శాతం నమ్మి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మిన మొదటి వ్యక్తి. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. చై బంగారం. చైతూని అందరూ బంగారం ఎందుకు అని అంటారో ఆయనతో పని చేశాక తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చేశాను. ఇప్పుడు బంగార్రాజు చేశాను. 24 కారెట్స్ కాస్త 48 కారెట్స్ అయింది. ఈ నాలుగేళ్లలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. మాట్లాడే పద్దతి, నటన, మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయి. చైలో ఉన్న క్లారిటీ మనకు పది శాతం ఉంటే.. హ్యాపీగా బతికేయోచ్చు. షాట్ విషయంలోనూ ఎంత కన్విన్స్ చేసినా కూడా ఒప్పుకోడు. చాలా కన్విన్స్ చేస్తే నాకు నచ్చలేదు కానీ నువ్ చెప్పావ్ కాబట్టి చేస్తాను అని అంటారు. అంత క్లియర్‌గా క్లారిటీగా ఉంటాడు కాబట్టి కారెక్టర్ చేయడం ఈజీగా అయింది. ఈ సినిమా వల్ల ప్రతీ రోజు సెట్‌లో కలిశాం. చై సైలెంట్ అని అనిపిస్తుంది. కానీ అంత సైలెంట్ కాదు. ఓపెన్ అప్ ఎంజాయ్ చేస్తే నవ్వు ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంత వరకు రాముడి పాత్రలు చేస్తే ఇప్పుడు చేసింది కృష్ణుడు కారెక్టర్. మొన్నే దక్ష కళ్లు ఎగరేసింది. నాగ చైతన్య సిగ్గు పడ్డాడు. ఆయన సిగ్గు పడటం కామన్. రమ్యకృష్ణ గారు అద్బుతమైన నటి. కృతికి ఇది మూడో సినిమానే. వందశాతం కష్టపడి చేసింది. ప్రాణం పెట్టారు అనే మాట తక్కువే. అంత కంటే ఎక్కువ కష్టపడ్డారు. వాసివాడి తస్సాదియ్యా, నా కోసం అనే పాటలను ముందు రికార్డ్ చేశాం. లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు అనూప్ స్టూడియోలో ఇంకో సినిమాను రికార్డ్ చేయలేదు. నేను తీసిన సీన్లు చూసి నాకే ఏడుపు వచ్చింది. ఆర్ఆర్‌తో అంత డెప్త్ తీసుకొచ్చారు. విజయ్ డెడికేటెడ్‌గా ఈ సినిమా కోసమే పని చేశారు. జునైద్ మాతో ముందు నుంచి పని చేస్తూనే ఉన్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ చూస్తే బయటకు వెళ్లి ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది. సినిమాలోని కారెక్టర్, ఎమోషన్స్ పట్టుకుని డిజైన్ చేస్తారు. అందుకే అలా ఇంపాక్ట్ చూపిస్తాయి. బ్రహ్మ కడలి గారు ఆలస్యం కాకుండా సెట్‌లు రెడీ చేసి ఇచ్చారు. సంవత్సరంలో చేయాల్సిన పని నాలుగు నెలలో చేశారు. మా డైరెక్షన్ టీంకు థ్యాంక్స్. రైటర్ సత్యానంద్ నా అన్ని సినిమాలకు పని చేశారు. ఈ సినిమా కోసం మూడేళ్లుగా పని చేశారు. ఆయనకు థ్యాంక్స్. జీకే గారు నా బ్రదర్ లాంటివారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేను. అందరికీ థ్యాంక్స్ అని అన్నారు.
వీడియో సందేశం ద్వారా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నా బంగార్రాజు నాగార్జున గారితో చాలా ఏళ్ల సక్సెస్ ఫుల్ జర్నీ ఉంది. బంగార్రాజు కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కృతి శెట్టి ఎంతో క్యూట్‌గా నటించింది. మా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు ఎంతో స్వీట్ పర్సన్. ఆయన ఉండే విధానం, రాసే పాటలు, మాటలకు అస్సలు సంబంధం ఉండదు. సోగ్గాడే సినిమా కంటే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. బంగార్రాజు టీం లేకపోతే ఇలా ఈ సినిమా సంక్రాంతికి వచ్చేది కాదు. పండుగ లాంటి సినిమా పండుగకు వచ్చింది. అందరూ థియేటర్లో చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. నాగ్ సర్‌కు ఇప్పటికే చాలా సార్లు థ్యాంక్స్ చెప్పాను. చై సర్‌కు థ్యాంక్స్. జీ స్టూడియోస్ నుంచి ఎలాంటి సినిమాలు తీయాలని అనుకున్నాం. నా టీంలో ముంబై వాళ్లున్నారు. నాగ్ సర్, బుల్లెట్, స్టిక్ ఉంటుంది అలాంటి సినిమా, నాగ చైతన్యతో లవ్ స్టోరీలాంటి సినిమా చేద్దామని అన్నారు. ముందు నాగార్జున గారితో చేసి.. ఆ తరువాత నాగ చైతన్య చేయాలని అనుకున్నాం. కానీ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. ఇంత పెద్ద బడ్జెట్ సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. ఓసారి లంచ్ టైంకి వెళ్లేటప్పుడు నాగార్జున, నాగ చైతన్య ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగుతున్నారు. అంతకు ముందే వాళ్లు ప్రయాణం చేసి వచ్చారు. అయినా కూడా ఎంతో ఫ్రెష్‌గా కనిపించారు. ఇక కళ్యాణ్ కృష్ణ అయితే ఆంక్యుపంక్చర్ చేయించుకుంటూ ఉన్నారు. సంక్రాంతికి రాబోతోన్నామని మొదటి నుంచి నాగ్ సర్ చెబుతూనే వచ్చారు. అనూప్ గారి మ్యూజిక్ అద్బుతంగా ఉంది. ప్రమోషన్స్ ఓ రకమైన కలర్ ఉండాలి.. ప్యాకేజ్‌లా ఉండాలని స్పెషల్‌గా డిజైన్ చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బంగారం అనే టైటిల్ బాగుంది. మనకు బాగా నచ్చితేనే బంగారం అని అంటాం. రమ్యకృష్ణ గారు సెట్‌లో బంగారం అని పిలుస్తూనే ఉంటారు. ఇలాంటి మంచి టైటిల్‌తో సినిమా రావడం ఆనందంగా ఉంది. సినిమాలో ఫైట్స్ చాలా స్టైలిష్‌గా కంపోజ్ చేశామని మాకు అనిపించింది. ప్రతీ సంక్రాంతికి ఇలాంటి బంగార్రాజు సినిమాలు రావాలి. పార్ట్ 2,3,4 తీయమని దర్శకుడికి చెప్పాను అని అన్నారు..
దక్ష నగర్కార్ మాట్లాడుతూ.. ఎంత సక్కగున్నావో అనే పాటతో నేను పరిచయం అవుతాను. నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చినందుకు నాగార్జున గారికి థ్యాంక్స్. నాగ చైతన్య నాకు ఎంతో స్పెషల్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.
దర్శన మాట్లాడతూ.. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున గారికి థ్యాంక్స్. నేను సినిమాను చూశాను. సూపర్ హిట్ అవుతుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమాను చూడండి అని అన్నారు.
ఎటిటర్ విజయ్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి థ్యాంక్స్. దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు థ్యాంక్స్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
జునైద్ మాట్లాడుతూ.. మూడు నెలల్లో దాదాపు వెయ్యి షాట్లు చేశాం. ఇదంతా కేవలం కళ్యాణ్ వల్లే సాధ్యమైంది. టీం అంతా కూడా వణికిపోయింది. నాగార్జున గారి నమ్మకం వల్లే ఇదంతా జరిగింది. ఆయన ఎప్పుడూ ఏ ప్రశ్న కూడా వేయలేదు. అన్నపూర్ణ స్టూడియో లేకపోతే ఇలాంటి వీఎఫెఎక్స్ చేసి ఉండేవాళ్లం కాదు అని అన్నారు.
కెమెరామెన్ యువరాజ్ మాట్లాడుతూ.. నాగార్జున గారికి నా సిన్సియర్ థ్యాంక్స్. సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని అందరికీ నమ్మకాన్ని ఇచ్చారు. నాగ చైతన్య గారితో మళ్లీ పని చేయడం సంతోషంగా ఉంది. ఒక్క నవ్వుతో కళ్యాణ్ గారు అందరి నుంచి పనిని రాబట్టుకుంటారు. అనూప్ సర్ మ్యూజిక్ అద్బుతంగా ఉంది. జునైద్ వీఎఫ్ఎక్స్ చాలా బాగా వచ్చాయి. బ్రహ్మకడలి తక్కువ సమయంలోనే సెట్స్ వేసి ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్ అని అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. అద్బుతమైన ప్రాజెక్ట్‌ను నాకు ఇచ్చినందుకు నాగార్జున గారికి, నాగ చైతన్యకు థ్యాంక్స్. తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాకు మాకు ఎంతో స్పెషల్. ఇంతగా మరే సినిమాకు కష్టపడలేదు. టీం అంతా కూడా చాలా కష్టపడింది. డే అంట్ నైట్ నాతో పని చేసిన నా మ్యూజిషియన్లకు థ్యాంక్స్. సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది. సోగ్గాడేలో నాగ్ సర్‌ని చూశారు. బాగా ఎంజాయ్ చేశారు. ఈ సారి ఇద్దరూ కలిసి రాబోతోన్నారు. ఎలా ఉంటుందో చూడబోతోన్నారు. ఇందులో ప్రతీ ఒక్కటి ఉంది. విందు భోజనంలా ఉంది. ఇది పెద్ద హిట్ కాబోతోంది అని అన్నారు.
అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్‌ను నాలుగైదు సార్లు తనివితీరా చూడండి. నాగార్జున, నాగ చైతన్య ఎప్పుడూ అలానే ఉండాలి. ఇలా బంగార్రాజు సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉండాలి. ఈ సంక్రాంతికి సినిమా రాబోతోంది. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమాను చూడండి అని అన్నారు.