శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:15 IST)

సెలెబ్రిటీలపై దేశ ద్రోహం కేసు ... బీహార్ పోలీసుల ఆదేశాలివే

బీహార్ రాష్ట్రంలో సినీ రంగానికి చెందిన 49 మంది సెలెబ్రిటీలపై నమోదైన దేశ ద్రోహం కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును బీహార్ పోలీసులు ఉపసంహరించుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. స్థానిక కోర్టు ఆదేశం మేరకు బీహార్ పోలీసులు ఈ తరహా కేసును నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
ఇటీవలి కాలంలో దేశంలో పెరుగుతున్న మూక దాడులను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ రంగానికి చెందిన 49 మంది సెలెబ్రిటీలపై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెల్సిందే. బిహార్‌లోని సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన దేశద్రోహం కేసును మూసివేయాలని ముజఫర్‌పూర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మనోజ్‌కుమార్‌ సిన్హా బుధవారం ఆదేశాలిచ్చారు. 
 
నిరాధార ఆరోపణలు చేసిన ఈ ఫిర్యాదుదారుపై విచారణ సాగుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వేర్పాటు ధోరణులను బలపరిచేలా బహిరంగ లేఖ రాశారంటూ ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్‌ కుమార్‌ ఓఝా అనే న్యాయవాది 50 మంది ప్రముఖులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ మణిరత్నం, అపర్ణాసేన్, కొంకణాసేన్‌, ఆదూర్‌ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, రేవతి, అనురాగ్‌ కశ్యప్‌, శ్యామ్‌బెనగల్‌ వంటి 50 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోడీకి జూలైలో లేఖ రాశారు. 
 
కాగా, మోడీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలు డిమాండ్‌ చేశాయి. దీంతో బీహార్‌ పోలీసులు వెనక్కుతగ్గారు.