దీపిక ఫోన్ సీజ్?? ఎన్సీబీ కార్యాలయానికి క్యూ కట్టిన హీరోయిన్లు!!
ముంబై డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జారీ చేసిన సమన్లకు బాలీవుడ్ హీరోయిన్లు స్పందిస్తున్నారు. సమన్లలో పేర్కొన్నట్టుగా వారు శనివారం ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. వీరిలో హీరోయిన్ దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు.. దీపిక మేనేజరు కరిష్మా ప్రకాష్‌లు ఉన్నారు.
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో సినీ పరిశ్రమలోని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. దీంతో ఎన్సీబీ అధికారులు రంగప్రవేశం చేసి ఆ డ్రగ్స్ దందాతో సంబంధం ఉన్న అందరికీ సమన్లు పంపి విచారణ జరుపుతున్నారు.
ఇందులో భాగంగా హీరోయిన్ దీపికా పదుకొణే శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారుల ముందు విచారణకు హాజరైంది. ఆమె నుంచి అధికారులు పలు వివరాలను రాబట్టారు. ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు వార్తుల వస్తున్నాయి.
మరోవైపు, ఈ డ్రగ్స్ కేసులో దీపికతో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు ప్రస్తుతం సాహో భామ శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి శ్రద్ధాకపూర్ వచ్చింది.
దీపిక, శ్రద్ధా, రకుల్‌తో పాటు ఈ కేసులో సారా అలీఖాన్, దీపిక మేనేజర్ కరీష్మా ప్రకాశ్‌కు ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు.
రకుల్ ఇంట్లో డ్రగ్స్ నిల్వ
ప్రకంపనలు రేపుతున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో బాంబు పేల్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయివున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మాత్రం డ్రగ్స్ ఎక్కడి నుంచో తెప్పించుకుని తన ఇంట్లో దాచిపెట్టి, ఆ తర్వాత తీసుకెళ్లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. పైగా, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టం చేసింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు వ్యవహారం కాస్త అనేక మలుపులు తిరిగి చివరకు బాలీవుడ్ డ్రగ్స్ దందాకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి నటి రకుల్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ఎన్‌సిబి ఎదుట హాజరు అయ్యారు. తన నివాసంలో దొరికిన మాదకద్రవ్యాలు పూర్తిగా తోటి నటి రియాకు చెందినవే అని తెలిపారు.
ఆమె ఎక్కడినుంచో తెప్పించుకున్న డ్రగ్స్ తన నివాసానికి వచ్చేవని, తర్వాత వాటిని తీసుకువెళ్లేవారని ఎన్‌సిబి ముందు అంగీకరించారు. రియాతో తాను డ్రగ్స్ చాట్ చేసినట్లు అంగీకరించారు. ముందు తనకు ఎన్‌సిబి సమన్లు అందలేదని ప్రకటిస్తూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్... శుక్రవారం నేరుగా ఎన్‌సిబి కార్యాలయానికి వెళ్లి విషయాలు వివరిస్తూ వాంగూల్మం ఇవ్వడం గమనార్హం.