శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (11:20 IST)

మెగాస్టార్ చిరంజీవి భుజానికి గాయం.. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆపరేషన్

మెగాస్టార్ చిరంజీవి భుజానికి గాయమైంది. దీంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల తిరుపతిలో ఏపీసీసీ చేపట్టిన 'నీరు-మట్టి' ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరుకాలేదు. తాజాగా ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమానికి కూడా చిరు హాజరు కాలేదు. దీంతో చిరు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారన్న పుకార్లు రేగాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలు అవాస్తవమంటూ ప్రకటించిన చిరంజీవి, సదరు కార్యక్రమాల్లో పాలుపంచుకోలేకపోయిన కారణాలను వివరిస్తూ నిన్న మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
తన భుజానికి గాయమైందని, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ గాయానికి చికిత్స తీసుకుంటున్నానని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలే గాయానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నానని కూడా చిరు తెలిపారు. ఇక చికిత్స ముగింపు దశకు వచ్చిందని, ఈ నెల 6న హైదరాబాదు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఏ కారణంగా గాయమైందన్న విషయాన్ని మాత్రం చిరు వెల్లడించలేదు.