గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (20:00 IST)

రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్‌లోకి "వాల్తేరు వీరయ్య" ఎంట్రీ

waltair veerayya
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబి కొల్లి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
బారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ చిత్రం 10 రోజులు గడిచిపోయినా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ.108 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడిస్తూ, ఓ పోస్టరును కూడా వెల్లడించింది. 
 
కాగా, చిరంజీవి మాస్ యాక్షన్‌కు రవితేజ క్రేజ్ తోడుకావడం, డీఎస్పీ మాస్ బీట్స్ కనెక్ట్ కావడం, రామ్ లక్ష్మణ్ ఫైట్స్‌, చిరంజీవి కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. అలాగే, ఈ చిత్రంలోని పాటలకు శేఖర్ మాస్టర్ అందించిన నృత్య రీతులు కూడా యువతను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.