అమ్మానాన్నలకు అన్నం పెట్టని అరాచకానికి పాతరేసిన దాసరి: 'తాతా మనవడు'తో విశ్వరూపం
నాటకాలపిచ్చితో మొదలై సినిమా వరకు లాగిన దాసరి నారాయణ రావు సినీ జీవితం కూడా భయంకర కష్టాల మధ్యే సాగింది. తొలుత కమెడియన్ వేషం వేసి అక్కడి సీనియర్ కమెడియన్ బాలకృష్ణ (అంజి) నుంచి ఘోరావమానాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత పాలగుమ్మి పద్మరాజు వద్ద రైటర్‌గా కుదిరారు
నాటకాలపిచ్చితో మొదలై సినిమా వరకు లాగిన దాసరి నారాయణ రావు సినీ జీవితం కూడా భయంకర కష్టాల మధ్యే సాగింది. తొలుత కమెడియన్ వేషం వేసి అక్కడి సీనియర్ కమెడియన్ బాలకృష్ణ (అంజి) నుంచి ఘోరావమానాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత పాలగుమ్మి పద్మరాజు వద్ద రైటర్‌గా కుదిరారు. . నిజాయతీగా పని చేయడం, రాసిన డైలాగ్‌ని నమ్మడం, సూర్యకాంతం లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఆ డైలాగ్‌ని మార్చమంటే, ససేమిరా అనడం... ఇవన్నీ దాసరి ఆత్మాభిమానాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నలుగురికీ తెలియజేశాయి. సినిమా పరిశ్రమలో మెల్లిగా అందరికీ దగ్గర కాగలిగారు.
నాటక రంగంలో ఉన్నప్పుడు నాగభూషణంతో ఏర్పడిన పరిచయం దాసరికి హెల్ప్ అయింది. దర్శకుడు భీమ్‌సింగ్‌కు దాసరిని పరిచయం చేశారు నాగభూషణం. అప్పటికి ఆయన ఎన్టీఆర్‌తో ‘ఒకే కుటుంబం’ అనే సినిమా తీస్తున్నారు. దానికి దాసరిని కో–డైరెక్టర్‌గా తీసుకున్నారు. కానీ భీమ్ సింగ్ మధ్యలోనే వదిలేయడంతో కో డైరెక్టర్‌గానే ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేశారు దాసరి. అదే తనకు తొలి సినిమా.
వెనువెంటనే బంపర్ ఆఫర్ వచ్చింది. నాగభూషణంతో ఉన్న పరిచయంతో ఆయన్ను ముఖ్య పాత్రలో పెట్టుకుని, దాసరి ఓ కథ రెడీ చేశారు. అదే ‘తాత–మనవడు’. నిర్మాత రాఘవ. అప్పటికి నాగభూషణం సూపర్ స్టార్ కావడంతో భారీ పారితోషికం అడిగారు. ‘ఇప్పుడు కొంచెం.. రిలీజై 50 రోజులాడిన వెంటనే మిగతా పారితోషికం ఇస్తా’ అని రాఘవ చెప్పిన మాటలను నాగభూషణంకు చేరవేశారు దాసరి. ‘ఏమో.. 50 రోజులాడుతుందా’ అని నాగభూషణం అనడం, దాసరి బాధపడటం జరిగాయి. చివరకు ఎస్వీఆర్, రాజబాబు, సత్యనారాయణలతో ఆ సినిమా తీశారు. 350 రోజులాడిందా సినిమా. ఒక కమెడియన్‌ని హీరోగా పెట్టి సినిమా తీయడమే సంచలనం అయిన ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ హీరోలకు తీసిపోకుండా డేరింగ్‌గా తీసిన తాత-మనవడు తెలుగు చిత్రసీమలో చిన్న సినిమాల మనుగడకు ప్రాణం పోసింది.
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకమై ఆస్తులే అనుబంధాలుగా మిగులుతున్న కాలం 1972లోనే తెలుగు సమాజాన్ని తాకింది. కన్న తల్లితండ్రులకు చివరి రోజుల్లో పట్టెడన్నం పెట్టని పాడు కాలం అప్పట్లేనే అడుగుపెడుతున్న క్షణాలను దాసరి ఒడిసిపట్టుకుని తెరకెక్కించారు. అదే తాత-మనవడు సినిమా. మనిషి జీవితం మానవీయ సంబంధాలకు దూరమై ఎలా వేడెక్కుతుందో చూడాలంటే… ముప్పై ఏళ్లక్రితమే వచ్చిన అపరూప చిత్రం తాతామనవడు చూడండి చాలు. ఇది దాసరి దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా అంటే ఎవరూ నమ్మకపోవచ్చు కూడా.
ఆ చిత్రంలో, కాటికి కాళ్లు చాపుకున్న కన్నతండ్రి ఇక ఒక్క క్షణం ఉన్నా కుటుంబానికి భారమే అనే ఉద్దేశ్యంతో సాక్షాత్తూ పుత్రరత్నమే తన ముదుసలి తండ్రికి గొయ్యి తవ్వుతూ కనిపిస్తాడు. అయితే ఆ పుత్రరత్నపు సుపుత్రరత్నం (తాతకు మనవడు) తన తండ్రికి సైతం గొయ్యి తవ్వాలని బయలుదేరుతాడు.. ఈ ఘోరం ఏమిట్రా తండ్రీ అని వాడి కన్నతండ్రి…. అదే తన తండ్రికి గొయ్యి తవ్వాలని చూసిన కొడుకే తన కుర్రాడిని అడిగితే… ఇదే చెబుతాడు. "నీవు నేర్పిన న్యాయమే కదా తండ్రీ, నువ్వు నీ తండ్రికి గొయ్యి తవ్వుతున్నప్పుడు కొన్నాళ్లకయినా నా తండ్రికి నేనే గొయ్యి తవ్వాలి కదా..అందుకని ఇప్పుడే మొదలెట్టేస్తున్నా" అంటాడు వాడు.
వృద్ధాప్యపు కోరల్లో చిక్కుకున్న ముసలి వారి పట్ల కుటుంబాలు ప్రవర్తిస్తున్న అమానుష ప్రవర్తనను దాసరి ఈ ఒక్క డైలాగుతో చీల్చి చెండాడారు. తెలుగు సమాజపు కపటత్వమనే గుండెమీద గుద్దిన సినిమాగా తాతమనవడు చరిత్రలో నిలిచిపోయింది. మనిషి జీవితంలోని అమానవీయ విధ్వంసాన్ని అత్యంత కరుణామయంగా చిత్రించిందీ సినిమా.. తీసిన 45 సంవత్సరాల తర్వాత కూడా (1972) ఈ సినిమాలో చూపించిన కుటుంబ దౌష్ట్యం ఇప్పటికీ కొనసాగుతోందంటే దాసరి దాన్ని తెరకెక్కించిన తీరులో దార్శనికత మనకు అర్థమవుతుంది