శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 31 మే 2017 (04:32 IST)

కష్టాల కొలిమిలో కాలి కాలి... కళామతల్లి ఒడిలో తరించిన దాసరి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1945 మే 4న సాయిరాజు, మహాలక్ష్మీ దంపతులకు జన్మించిన దాసరి బాల్యం వడ్డించిన విస్తరికాదు. కష్టం తప్ప సుఖం తెలియని పసితనంలోనే ఆయన కాయకష్టం చేసి పొట్టపోసుకున్నారు. వడ్రంగి మొదలు సైకిల్‌ మెకానిక్‌ వరకు అన్ని పనులు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1945 మే 4న సాయిరాజు, మహాలక్ష్మీ దంపతులకు జన్మించిన దాసరి బాల్యం వడ్డించిన విస్తరికాదు. కష్టం తప్ప సుఖం తెలియని పసితనంలోనే ఆయన కాయకష్టం చేసి పొట్టపోసుకున్నారు. వడ్రంగి మొదలు సైకిల్‌ మెకానిక్‌ వరకు అన్ని పనులు చేశారు. దాసరి తండ్రి పొగాకు వ్యాపారి. ఆరుగురు సంతానంలో దాసరి మూడోవారు. పాలకొల్లు ఎంఎంకేఎన్‌ఎం హైస్కూల్‌లో దాసరి 6వ తరగతి చదువుతున్న సమయంలో వారి కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. గోదాములోని పొగాకు కాలిపోవడంతో ఆర్థిక పరిస్థితి తిరగబడింది. నాడు స్కూలు ఫీజు మూడు రూపాయల పావలా కట్టడానికి కూడా డబ్బుల్లేక వడ్రంగి దుకాణంలో నెలకు ఒక రూపాయికి పనికి కుదిరారు.
 
దాసరి కష్టాలకు కరిగిన ఓ మాస్టారు స్కూలు ఫీజు కట్టి చదివించినా తిండికి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చివరకు చందాలతో చదువుకున్నానని సాక్షాత్తు దాసరే స్వయంగా చెప్పుకున్నారు. ఈ కష్టాల మధ్యే ఆయన డిగ్రీ వరకు చదువుకున్నారు. వాస్తవానికి దాసరి పుట్టింది 1945లో. అయితే ఆయన బర్త్‌ సర్టిఫికెట్‌లో మాత్రం 1947గా ఉంది. ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని దాసరి స్వయంగా చెప్పారు. రాజ్యసభకు ఇచ్చిన డిక్లరేషన్‌లోనూ ఆయన 1947గానే పేర్కొన్నారు.
 
హైస్కూల్‌ స్థాయిలోనే నాటక రంగంపై మక్కువ పెంచుకున్న దాసరి.. నటుడిగా, రచయితగా, ప్రయోక్తగా, దర్శకుడిగా ఎదిగారు. అవార్డులు, రివార్డులకు మారు పేరయ్యారు. నాటక రంగ అనుభవంతో సినీరంగ ప్రవేశం చేసి ఒక్క ఛాన్స్‌ కోసం చెప్పులరిగేలా తిరిగారు. తాతా–మనవడు చిత్రంతో పల్లె జనం హృదయాలను కదిలించారు. దర్శకత్వంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి అపార ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. 
 
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ వంటి అగ్రనటుల జీవితాలను సైతం మలుపు తిప్పే చిత్రాలను నిర్మించారు. జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌ను రాజకీయం వైపు మరల్చడానికి దాసరి తీసిన చిత్రాలే ప్రేరణ అని చెబుతారు. ఎన్టీఆర్‌ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులకెక్కారు.
 
శివరంజని, ప్రేమాభిషేకం, మేఘసందేశం, గోరింటాకు, సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి, ఒసేయ్‌ రాములమ్మ తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన తాతా–మనవడు చిత్రం ఏకంగా 350 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. తర్వాత సంసారం సాగరం, బంట్రోతు భార్య, స్వర్గం–నరకం.. ఇలా హిట్ల మీద హిట్లు సాధించారు. దర్శకుడిగా ఆయన ఆఖరు చిత్రం ఎర్రబస్సు(151వ చిత్రం). 2010లో ఆయన దర్శకత్వం వహించిన 149 సినిమా యంగ్‌ ఇండియాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అంకితమిచ్చారు. నందమూరి బాలకృష్ణ హీరోగా 150వ చిత్రం పరమ వీర చక్ర తీశారు.
 
తెలుగు చలన చిత్రరంగంలో అన్ని రికార్డులూ ఆయన పేరు మీదే నమోదు కావడం విశేషం. దర్శకుల స్థాయిని, సాంకేతిక నిపుణలు గౌరవాన్ని శిఖర స్థాయిలో నిలిపిన తొలి దర్శకుడు దాసరి. 1980లో ఒకే సంవత్సరంలో దాసరి తీసిన 14 సినిమాలు విడుదలయ్యాయంటే అప్పట్లో ఆయన స్టామినా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక దర్శకుడు ఒక సంవత్సరం 14 సినిమాలు తీసి విడుదల చేయడం ప్రపంచ సినీరంగ చరిత్రలోనే అరుదైన ఘటన. రాఘవేంద్రరావుతో పోటీపడి అటు నందమూరి, ఇటు అక్కినేనికి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఘనతా దాసరిదే..