గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (15:56 IST)

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం.. హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త మృతి

surya kiran
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. హీరోయిన్ కావేరి కళ్యాణి మాజీ భర్త, నటుడు, దర్శకుడు సూర్యకిరణ్ అనారోగ్యం కారణంగా సోమవారం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా పచ్చకామెర్లతో బాధపడుతూ చెన్నై నగరంలోని జెమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఈ కామెర్లు తగ్గకపోవడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన కొద్ది సేపటికే అంటే సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
ఈయన 'సత్యం' చిత్రంలో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ధన 51',' రాజుభాయ్', 'చాప్టర్ 6', 'నీలిమై' వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. మరికొన్ని చిత్రాలకు రచయితగా కూడా పని చేశారు. సూర్యకిరణ్ హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ దంపతులు విడిపోయారు. ఈయన సోదరి సుజిత ఓ టీవీ సీరియల్ నటి. ఆయన అంత్యక్రియలు మంగళవారం నగరంలో జరుగనున్నాయి. తమిళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడుగా కూడా గుర్తింపు పొందారు. మొత్తం ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.