మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (09:46 IST)

క్వార్టర్ మద్యం బాటిల్ రూ.1200 - తమిళ నటుడు అరెస్టు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో వుంది. దీంతో అన్ని రకాల సేవల్ బంద్ అయివున్నాయి. ముఖ్యంగా, అత్యావసర సేవలు మినహా ఇతర సేవలేవీ అందుబాటులో లేవు. అలాగే, మద్యం దుకాణాలు కూడా మూసివేసివున్నాయి. దీంతో మద్యంబాబులు మద్యం లేక కొట్టుమిట్టాడుతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా మద్యం అమ్ముతున్నారని తెలిస్తే.. రూ.వందలు, రూ.వేలు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ తమిళ సహాయ నటుడు అక్రమంగా మద్యం బాటిళ్లను విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అదీ కూడా క్వార్టర్ మద్యం బాటిల్ ఏకంగా రూ.1200కు విక్రయిస్తూ పట్టుబడటంతో ఎక్సైజ్ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన చెన్నై నగరంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైలోని ఎంజీఆర్ నగర్ పరిధిలోని అన్నా మెయిన్ రోడ్డులో ఓ ఇంట మద్యం విక్రయాలు సాగుతున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి వారు ఆ ఇంటిపై మెరుపుదాడి చేశారు. ఈ సోదాల్లో కోలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రిస్కాన్ (30) అనే యువకుడిని అరెస్ట్ చేశారు. 
 
తన మిత్రుల నుంచి రూ.1000కి క్వార్టర్ కొని, తాను రూ.1,200కు అమ్ముతున్నానని పోలీసుల విచారణలో రిస్కాన్ వెల్లడించాడు. రిస్కాన్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.