లైలా చిత్రం గెటప్ లో వున్నా స్నేహమే లాక్కొచ్చింది : విశ్వక్ సేన్
Vishvak Sen in Laila film getup
సినీ హీరోలు కొత్త సినిమా గెటప్ లో వుంటే బయటవారికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. కానీ విశ్వక్ సేన్ కు అలాంటి పరిస్థితి వచ్చినా స్నేహితుడికోసం ఆ గెటప్ తోనే వచ్చాడు. శుక్రవారం అమీర్‌పేట్ మ్యారిగోల్డ్ హోటల్‌లో డెయిరీ ట్రెండ్స్ సంస్థ యొక్క లోగో మరియు ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రముఖ సినీ హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Sridharbabu, Hotel Dairy Trends team
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ, " రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్ళడంలో, ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార పరిశ్రమలు ఎంతో కీలకం. యువతకు ఉపాధితో పాటు స్వయం ఉపాధి కల్పించడంలో కీలకంగా ఉంటున్న వ్యాపారులకు, వాణిజ్య రంగ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తున్నాము. వారికి అన్ని రకాలుగా అండగా ఉండేందుకు పలు పాలసీలను సైతం తీసుకొచ్చాము. ఏ సంస్థ అయినా వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి. అప్పుడు ప్రజాదరణ చూరగొంటారు." అని అన్నారు.
విశ్వక్‌సేన్ మాట్లాడుతూ, "ఇది కమర్షియల్ ఈవెంట్ కాదు. నా స్నేహితుడి కోసం ఇక్కడకు వచ్చాను. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఇద్దరం కలిసి చదువుకున్నాం. అంకుల్ కూడా మా నాన్నలాగే పోటీపడి నన్ను తిట్టేవాడు. మా నాన్న, అంకుల్ ఇద్దరూ కూడా స్నేహితులు. కేవలం స్నేహం కోసమే ఇక్కడికి వచ్చాను. నాకు లాంచింగ్ విషయం తెలియగానే, నేనే వస్తా అని చెప్పా. లైలా షూటింగ్ కోసం నైట్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. లుక్ రివీల్ కాకూడదని అనుకున్నా. కానీ మాస్క్ పెట్టుకుని వస్తే బాగోదని ఇలా వచ్చేశా. డెయిరీ ట్రెండ్స్ ఐస్ క్రీమ్ బ్రాండ్ బాగా పాపులర్ అవ్వాలి. నా మిత్రుడికి మంచి పేరు తీసుకురావాలి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ కూడా డెయిరీ ట్రెండ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను. అన్ని ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందరూ తప్పకుండా టేస్ట్ చేయండి" అన్నారు.
ఈ కార్యక్రమంలో డెయిరీ ట్రెండ్స్ సీఈవో శ్యాంసుందర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.