శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (12:49 IST)

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌ అరెస్టు.. 14 రోజుల రిమాండ్

చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను హైదరాబాద్ నగర జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన్ను గురువారం ఉదయం కడప జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన్ను కడప జిల్లా జైలుకు తరలించారు. 
 
కడపకు చెందిన మహేశ్ అనే వ్యక్తి నుంచి బండ్ల గణేష్ 2011లో రూ.13 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తీర్చకపోవడంతో గత 2013లో గణేశ్‌పై మహేశ్ చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ వ్యవహారంలో బండ్ల గణేశ్‌పై కడప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
అయితే, కోర్టు విచారణకు గణేశ్ హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో, బండ్ల గణేశ్‌ను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 
 
మరోవైపు, గురువారం ఉదయం బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేస్తూ, తనను ఏ పోలీసులు అరెస్టు చేయలేదనీ, ఓ కేసు విచారణ నిమిత్తం, చట్టంపై గౌరవం ఉండటంతో స్టేషన్‌కు వచ్చినట్టు ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేటికే బండ్ల గణేశ్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించడం గమనార్హం. దీంతో నవంబరు 4వ తేదీ వరకు ఆయన జైలులో ఉండనున్నారు.