గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (09:51 IST)

అబ్ధుల్ కలాం ప్రియ శిష్యుడు వివేక్.. 500 సినిమాల్లో నటించి.. వ్యాక్సిన్ తీసుకున్న మరునాడే..? (video)

Vivek
తన కామెడీతో కోట్లాది ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్(59) శనివారం తెల్లవారుఝామున 4.35 ని.లకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా ఉంది. ఆయన వయసు 59 ఏళ్లు. ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్ తమిళ ప్రేక్షకులకే కాదు, తెలుగువారికీ సుపరిచితుడే. 
 
శుక్రవారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. స్పృహ కోల్పోయిన వివేక్‌ను కుటుంబ సభ్యులు వెంటనే సిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే ఆయనకు చికిత్స జరిగింది. అయినా చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. వివేక్ భౌతిక కాయాన్ని విరుగంబాకంలోని ఆయన నివాసానికి తరలించారు.
 
వివేక్ కమెడీయన్‌గానే కాకుంగా మానవతా వాదిగా, సామాజిక చైతన్యం గల వ్యక్తిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాంకు ప్రియశిష్యుడు. వివేక్ అంటే కలాంకు చాలా ఇష్టం. గతంలో తనను ఇంటర్వ్యూ చేసే ఓ అవకాశాన్ని అబ్దుల్ కలాం వివేక్‌కే ఇచ్చినట్లు స్వయంగా చెప్పారు. కలాంను ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశం తనకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు వివేక్. 
Vivek
 
ఇలా కమెడియన్, మనస్సున్న మనిషిగా అభిమానుల మదిలో నిలిచిన వివేక్ ఇక లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన హఠాన్మరణం చెందడంతో అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు శోక సంద్రంలో మునిగారు. ఆయన మృతికి ప్రకాశ్ రాజ్, ఖుష్బూ, నివీన్ పాలి వంటి పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు.
 
"నా స్నేహితుడు వివేక్ ఇంత త్వరగా వదిలి వెళతాడని ఊహించలేదు. ఆలోచనలు మరియు చెట్లను నాటినందుకు ధన్యవాదాలు. మీ తెలివి తేటలు, కామెడీతో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం" అని ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు . 
Kalam
 
"లెజెండ్ ఇక లేరని నమ్మలేకపోతున్నాం. మీతో పని చేసిన క్షణాలు ఎప్పుడు మా మదిలో నిలిచి ఉంటాయి. కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను" – మోహన్ రాజా
 
"వివేక్ లేడనే వార్త పెద్ద షాకింగ్. ఎంతో చురుకైన వ్యక్తి ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. మీరు ఉన్నన్ని రోజుల మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు కన్నీళ్లు, బాధలను మిగిల్చి వెళ్లారు" అంటూ ఖుష్బూ భావోద్వేగంతో ట్వీట్ చేసింది.
 
వ్యాక్సీన్ తీసుకున్న మరునాడే...
వివేక్ గురువారం నాడు చెన్నైలోని గవర్నమెంట్ హై స్పెషాలిటీ హాస్పిటల్‌లో కరోనా వ్యాక్సీన్ తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "కరోనా వ్యాక్సీన్ విషయంలో కొంతమందికి భయాలున్నాయి. అలాంటి భయాలు ఏమీ అక్కర్లేదని చెప్పడానికే నేను ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా వేయించుకున్నాను" అని మీడియాతో అన్నారు. 
 
వ్యాక్సీన్ ఇచ్చినందుకు ఆయన ఆరోగ్య శాఖ కార్యదర్శి జె. రాధాకృష్ణన్, హాస్పిటల్ డీన్ జయంతి, మరో ఇద్దరు డాక్టర్లకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ కూడా చేశారు. టీకా తీసుకున్న మరునాడు ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అయితే, ఆయనకు గుండెపోటు రావడానికి, వ్యాక్సీన్‌కు ఎలాంటి సంబంధం లేదని సిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.