శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (16:43 IST)

''క‌ళాకార్‌"తో రీఎంట్రీ ఇస్తున్న "6 టీన్స్" హీరో రోహిత్‌

Kalakaar
6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, గుడ్‌బాయ్‌, నేను సీతామాలక్ష్మి, నవవసంతం, సొంతం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిత్‌ హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కళాకార్‌'. 
 
ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. షాయాజీషిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయ్యింది. 
 
ఈ సందర్భంగా.. హీరో రోహిత్‌ మాట్లాడుతూ- ''నేను ఫస్ట్‌ టైమ్‌ ఒక ఫ్యూర్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. ఈ సినిమాలో నాది ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీనుగారి మేకింగ్‌ కొత్తగా ఉంది. డెఫినెట్‌గా ఈ మూవీ ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మిమ్మల్ని అలరిస్తుంది. నా గత చిత్రాల్లాగానే ఈ మూవీకి కూడా మీ అందరి బ్లెసింగ్స్‌ ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
 
చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ- ''మా ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో రూపొందుతోన్న రెండవ చిత్రం 'కళాకార్‌'. మంచి బడ్జెట్‌ మరియు భారీ తారాగణంతో దర్శకుడు శ్రీనివాస్‌ బందెల   ఈ  మూవీని తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ నుండి మంచి సపోర్ట్‌ లభిస్తోంది. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
 
చిత్ర దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ- ''కళాకారుల నేపథ్యంతో రూపొందుతోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ ఇది. సినిమా పరిశ్రమపై మక్కువతో ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. వారిలో కొంత మంది ఇండస్ట్రీలో రాణిస్తుంటారు మరి కొంత మంది తిరిగి వెళ్లిపోతుంటారు. అయితే తిరిగి వెళ్లలేని కొంత మంది జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. 
 
6 టీన్స్‌ హీరో రోహిత్‌ చాలా రోజుల తర్వాత నటిస్తోన్న కమ్‌బ్యాక్‌ మూవీ ఇది. అలాగే చాలా మంది సీనియర్‌ ఆర్టిస్టులు నటించడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తయ్యింది. సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి జాజాపురం గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్సెస్‌, సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ తప్పకుండా మిమ్మల్ని థ్రిల్‌ చేస్తాయి'' అన్నారు.
 
నటుడు షాయాజీ షిండే మాట్లాడుతూ- ''ఈ సినిమాలో ఒక సీనియర్‌ లాయర్‌ పాత్ర పోషిస్తున్నాను. ఒక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో శ్రీనుగారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మంచి క్యారెక్టర్‌ చాలా ఎంజాయ్‌ చేస్తూ చేస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
 
నటుడు రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ - ''ఈ సినిమాలో లాయర్‌గా ఒక కీలకమైన క్యారెక్టర్‌ చేస్తున్నాను. చాలామంది సీనియర్‌ ఆర్టిస్టులు నటించిన ఈ కళాకార్‌ చిత్రాన్ని మీ కళాహృదయంతో ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు. నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ - ''కళాకారుల కష్టాల గురించి తెలిపే చిత్రమిది'' అన్నారు.
 
రోహిత్‌, షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌విహారి, నలినీ కాంత్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్‌, రమేష్‌వర్మ, బస్టాఫ్‌ కోటేశ్వరావు, ఘర్షణ శ్రీకాంత్‌, అరుణ, నాగిరెడ్డి, మనోజ్‌కుమార్‌, జయవాణి, సూర్య తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: అమర్‌ జి, సంగీతం: చిన్నా, మాటలు: మరళి కృష్ణ, గోపి కిరణ్‌, పాటలు: జెబి లక్ష్మణ గంగ, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, దేవరాజ, కొరియోగ్రఫి: శామ్యేల్‌, కాస్ట్యూమ్స్‌:మెహబూబ్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పరిటాల రాంబాబు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివారెడ్డి జాజాపురం, నిర్మాత: వెంకటరెడ్డి జాజాపురం. కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శ్రీను బందెల.