రాజకీయ నాయకులపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
తమిళ, తెలుగు కథానాయకుడు విశాల్ పలు సేవాకార్యకమాలు చేస్తూనే నటుడిగా కొనసాగుతూ వున్నారు. తాజాగా ఆయన నటించిన సినిమా రత్నం. త్వరలో విడుదలకాబోతుంది. హైదరాబాద్ వచ్చిన ఆయన రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాటల్లో... దయచేసి మే 13న కొత్త ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలి. తమిళనాడులో నా ఓటు నేను వేశాను. తమిళనాడులో 70 శాతం ఓటింగ్ నమోదైంది, ఇంకో 20 శాతం పోలైతే విప్లవాత్మకమయ్యేది. తమిళనాడులో ఓటింగ్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలి.
శుక్రవారం కాకపోతే మరో శుక్రవారం సినిమా చూడొచ్చు. ఓటు మాత్రం ఒక రోజు మాత్రమే వేయగలం. ఐదు సంవత్సరాలకోసారి ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చుకోవాలి. నమ్మిన వాళ్లకు ఓటు వేయండి. ఓటు వేయించుకున్న వాళ్లు చేయాల్సిన బాధ్యత చేయాలి.
నేను ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేయమని చెప్పను. ఎవరిని కించపరిచేలా మాట్లడటం నాకు ఇష్టం ఉండదు. నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటాను.
తమిళనాడులో ఇంకో జెండా, ఇంకో నాయకుడు రాకూడదనుకుంటాను. రాజకీయ నాయకులు వాళ్ల పని సరిగ్గా చేస్తే మరో పార్టీ , ఇంకో నాయకుడు పుట్టడు. రాజకీనాయకులు నటులుగా మాట్లాడుతుంటే నటులు రాజకీయ నాయకులవుతున్నారు.
రాజకీయం అనేది సమాజ సేవ. నేను అమ్మ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాను. మా స్వచ్చంద సంస్థ ద్వారా తెలియని వ్యక్తులకు సాయం చేయడం మా ఏజెండా. రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయడం ఎజెండాగా ఉండాలి. ప్రజలు బెంజ్ కార్ అడుగుతారా? బంజారాహిల్స్ లో ఇళ్లు అడుగుతున్నారా ?
తాగడానికి మంచినీళ్లు, విద్య, వైద్యం, బతకాలని ప్రజలు అడుగుతారు.
నేను ఇప్పుడు ఒక ఓటరును మాత్రమే. నేను ఏ రాజకీయ నాయకుడితో కలిసి పనిచేయను, ఏ పార్టీలో కలిసిపోను అని తెలిపారు.