శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 20 మే 2017 (07:47 IST)

బాహుబలి సీక్వెల్స్ వసూళ్లు రూ. 2,200 కోట్లా.. బాలీవుడ్ హీరోలం సిగ్గుపడాలి అంటున్న హృతిక్ రోషన్

బాహుబలి 1, బాహుబలి 2 కలిసి ఇప్పటికే 2,200 కోట్లపైగా కలెక్షన్ల పంట పడించాయి. ఇది ఇప్పటివరకూ విడుదలైన భారతీయ సీక్వెల్ సినిమాలలో కనీవినీ ఎరుగని ఒక రికార్డు. సరిగ్గా ఈ అంశంపైనే హృతిక్ రోషన్ స్పందిస్తూ, బాహుబలి సాదిస్తున్న కలెక్షన్లు, రికార్డులు ఊహించలేన

బాహుబలి 2 ది కంక్లూజన్ సాధించిన విజయం చూసి భారతదేశం గర్వపడితే, బాలీవుడ్ షేక్ అయిందనే చెప్పాలి. మీడియా కూడా ఈ విషయాన్నే గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తోంది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులయితే తన హీరోలు చేస్తున్న సినిమాల తీరుతెన్నులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు చాలామంది టాప్ హీరోలు ఇన్ని రికార్డులు సాధించిన బాహుబలి-2 సినిమాపై పెద్దగా స్పందించకపోవడంతో, వారిలో విపరీతంగా అభద్రతా భావం, అసూయ ఏర్పడ్డాయేమోనని అటు ప్రేక్షకులూ, ఇటు విశ్లేషకులూ భావిస్తున్నారు. ఇక లేటెస్టుగా బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ అయితే బాహుబలి 2 సాధిస్తున్న రికార్డులు, కలెక్షన్లపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. 
 
హృతిక్ రోషన్ గతంలో కోయి మిల్ గయా సినిమాకు అనేక స్వీక్వెల్స్ చేసి విడుదల చేశాడు కానీ అవేవీ బాహుబలి 2 అంత సత్తా చాటలేకపోయాయి. బాహుబలి 1, బాహుబలి 2 కలిసి ఇప్పటికే 2,200 కోట్లపైగా కలెక్షన్ల పంట పడించాయి. ఇది ఇప్పటివరకూ విడుదలైన భారతీయ సీక్వెల్ సినిమాలలో  కనీవినీ ఎరుగని ఒక రికార్డు. సరిగ్గా ఈ అంశంపైనే హృతిక్ రోషన్ స్పందిస్తూ, బాహుబలి సాదిస్తున్న కలెక్షన్లు, రికార్డులు ఊహించలేనివి. ఈ సినిమా సాధించిన విజయాలు చూసి బాలీవుడ్ హీరోలు సిగ్గుపడాలి. ముఖ్యంగా నా సినిమాలు. నేను కూడా బాహుబలి సినిమా నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనేశాడు. ఇదే ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. కానీ ఇంతకుముందెన్నడూ బాహుబలి రేంజ్ సక్సెస్ ఏ సినిమా కూడూ చవిచూడలేదు. కానీ బాహుబలి -2 ఇప్పుడు హలీవుడ్ సినిమాల రేంజిలో కలెక్షన్లను కొల్లగొడుతుండటంతో అందరూ అవాక్కవుతున్నారు. మరి హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలపై మిగతా హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 
 
కాని ఒకటి మాత్రం తెలిసిపోయింది. బాలీవుడ్‌లో ఘనాపాఠీలుగా పేరొందిన కొంతమంది లబ్దప్రతిష్టులు తామెంత అల్పబుద్ధులవారిమో బాహుబలి-2 సాక్షిగా ప్రదర్శించేసుకున్నారు. బాహుబలి-1 ది బిగినింగ్‌ని రానా మైక్ పెడితే ఆకాశానికి ఎత్తి పొగిడేసిన అదే అమితాబ్ బచ్చన్ బాహుబలి-2 సక్సెస్ గురించి మీడియా అడిగితే దారుణమైన కామెంట్ చేశాడు. ఇక అమీర్ ఖాన్ అయితే పత్తా లేడు. వీళ్లకు భారత దేశమంతటా తమ సినిమాలు బాగా ఆడాలి, కలెక్షన్ల పంట పండించాలి. అంతే కానీ ఒక ప్రాంతీయ సినిమా జాతీయ సరిహద్దులు దాటి అంతర్జాతీయ చిత్రసీమ యవనికపై అంతటి అత్యద్భుత విజయం సాధిస్తుంటే ఆ విజయం తమందరిదీ, భారతీయ చిత్రపరిశ్రమ విజయం అని ప్రకటించే, ప్రశంసించే కనీస సంస్కారం కూడా లేదు. 
 
వీరి అల్పబుద్దికి తగినట్లుగానే ఏప్రిల్ 28న బాహుబలి-2 సునామి వచ్చి పడిన తర్వాత విడుదలవుతున్న బాలీవుడ్ ప్రబుద్ధుల సినిమాలు చంకనాకిపోతున్నాయి.  ఈ విధంగా కూడా బాహుబలి-2  శిఖర స్థాయిలోనే నిలబడింది. ఒక ప్రాంతీయ సినిమా ప్రేక్షకులుగా మనం మాత్రం బాలీవుడ్ సంకుచితత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు తెలుగు నేలలో కులాలు, వర్గాలు, సినీ కుటుంబాలు, వారి గొప్పతనాలు బాహుబలి ముందు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. బాహుబలి-2 సినిమా సాధించిన అఖండ విజయాన్ని అందరి విజయంగా గుర్తిస్తేనే, గౌరవిస్తేనే ఒక గొప్ప అంతర్జాతీయ మార్కెట్ ఇప్పుడు మన కళ్లముందుకు వచ్చిందనే సత్యాన్ని అర్థం చేసుకుని ఇకపై ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. 
 
ఈ అంతర్జాతీయ మార్కెట్‌లో వాటాకోసం కొట్లాడే సినిమాలే, కథలే మనకిప్పుడు కావాలి. అంతేకాని పనికిరాని హీరోయిజాలు కావు. సినిమాల పేరుతో కులపోరాటాలు అంతకంటే కావు. ఆ కులాల వర్గాల హీరోయిజాలను చావు దెబ్బ కొట్టడమే బాహుబలి సాధించిన విజయం. దీన్ని అర్థం చేసుకోకపోతే మన బతుకు ఇంకా బతికి ఉన్నంతవరకు నాలుగు పాటలు, మూడు ఫైట్లు, పనికిరాని మేనరిజాలు, బుడబుక్కల హీరోయిజాలకు అంటిపెట్టుకుని హాయిగా ఇక్కడే సంచరిస్తూ ఉంటుంది. మనందరి ఖర్మ అలాగే ఉండాలనుకుంటే ఉందాం. మనదేం పోయింది?