గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (09:18 IST)

హైదరాబాద్ నగరంలో సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం...

హైదరాబాద్ నగరంలో ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యమయ్యాడు. బాకీ డబ్బులు వసూలు చేసుకుని వస్తానని చెప్పి వెళ్లిన ఆ పంపిణీదారుడు తిరిగి రాకపోవడంతో కలకలం రేగింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో యూసుఫ్ గూడలో ఉన్న సినీ కార్యాలయానికి అతను వెళ్లగా, కార్యాలయం బయటు ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పులు, బైక్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బేగంపేటకు చెందిన నగేశ్ (62) అనే వ్యక్తి టాలీవుడ్‌లో సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నారు. ఈయన యూసుఫ్‌గూడకు చెందిన సజ్జు అనే వ్యక్తికి గతంలో 5 లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చారు. ఆ సొమ్మును వసూలు చేసుకుని వస్తానంటూ ఈ నెల 6న నగేశ్ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆ తర్వాత కుమార్తె సింధూజతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారు.
 
అదేరోజు రాత్రి 10.30 గంటలకు ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయింది. తండ్రి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో సింధూజ కంగారుపడ్డారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో సజ్జు కార్యాలయానికి వచ్చిన సింధూజకు అక్కడ తన తండ్రి పాదరక్షలతోపాటు ఆఫీసు బయట ఆయన ద్విచక్ర వాహనం కూడా కనిపించింది. 
 
అయితే, నగేశ్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో ఆమె వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సజ్జుకు చెందిన మనుషులే అతన్ని కిడ్నాప్ చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.