శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (15:53 IST)

టీఎన్నార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

ఇటీవల కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ సినీ పాత్రికేయుడు, వ్యాఖ్యాత, నటుడు టీఎన్నార్ మృతిపట్ల ఆయన పనిచేస్తున్న సంస్థ ఐ డీమ్ర్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టీఎన్నార్ కుటుంబానికి ఆ సంస్థ రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 
 
టీఎన్నార్ గతంలో ఐ డ్రీమ్ యూట్యూబ్ చానల్ కోసం అనేకమంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు. ఐ డ్రీమ్ పాప్యులారిటీ పెంచడంలో తనవంతు శ్రమించారు. తమ సంస్థ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన టీఎన్నార్ ఇప్పుడు తమ మధ్య లేకపోవడం పట్ల ఐ డ్రీమ్ మీడియా సంస్థ చైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 
ఆయన టీఎన్నార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల చెక్ ను టీఎన్నార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. టీఎన్నార్ పిల్లలను చదివించే బాధ్యతను కూడా తాను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఐ డ్రీమ్ సంస్థలో టీఎన్నార్ ఉద్యోగి మాత్రమే కాదని, తనకు సన్నిహితుడు అని వాసుదేవరెడ్డి తెలిపారు. సంస్థ ఎదుగుదలకు విలువైన సూచనలు, సలహాలు అందించాడని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
 
కాగా, టీఎన్నార్ పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని, వారికి అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని వాసుదేవరెడ్డి వెల్లడించారు.