ప్రెగ్నెన్సీ టెస్టులా.. అబ్బే ఆ షోను చూడటం మానేయండి.. బిగ్ బాస్‌పై ఏపీ హైకోర్టు
రియాల్టీ షో బిగ్ బాస్‌పై ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ రియాల్టీ షోపై అభ్యంతరం వుంటే చూడటం మానేయాలని హైకోర్టు సలహా ఇచ్చింది. టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు భారీ క్రేజ్ వుంది. అలాగే దానిపై వ్యతిరేకతకు కొదువ లేదు.
బిగ్ బాస్ షోపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అశ్లీలత, అసభ్యతతో కూడిన బిగ్ బాస్‌పై నిషేధం విధించాలని రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే నిర్మాత వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బిగ్ బాస్ షో నచ్చకపోతే చూడటం మానేయాలని హితవు పలికింది.
శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రతాప్ వెంకట్ జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది. బిగ్ బాస్ షో అశ్లీలతను ప్రోత్సహిస్తోందని, ఇందులో పాల్గొనే మహిళలను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది జి శివప్రసాద్ రెడ్డి అన్నారు.
ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ తరపు న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ షో ముగింపు దశకు వచ్చిందన్నారు. టీవీ షో కంటెంట్‌పై ఫిర్యాదు చేయడానికి పిటిషనర్‌కు ఇతర ఫోరమ్‌లు ఉన్నాయని, ప్రత్యామ్నాయ వేదికలు ఉన్నప్పుడు పిటిషనర్ కోర్టును ఆశ్రయించలేరని ఆయన అన్నారు.
ఇదే విషయాన్ని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని టీవీ ఛానల్ న్యాయవాదిని కోరిన ధర్మాసనం, ఒక వ్యక్తి ఏం మాట్లాడాలో కోర్టు నిర్దేశించదని పేర్కొంది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో బిగ్‌బాస్ కంటే అభ్యంతరకరమైన షోలు ఉన్నాయని, అభ్యంతరకరంగా భావిస్తే షోను చూడవద్దని పిటిషనర్‌ను బెంచ్ కోరింది.