శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 21 మార్చి 2017 (02:42 IST)

ఎస్పీ బాలు, ఇళయరాజా మధ్య రాయల్టీ గొడవ న్యాయమేనా?

‘లాభాపేక్ష కలిగిన కచేరీలలో తన పాటలు పాడటం కాపీరైట్‌ చట్ట ప్రకారం నేరమనీ కనుక పాడటం ఆపి వేయమని’ ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తన లాయర్‌ ద్వారా నోటీసులు అందించారు. నోటీసు ఇచ్చినవాడు స్నేహితుడు. పుచ్

‘లాభాపేక్ష కలిగిన కచేరీలలో తన పాటలు పాడటం కాపీరైట్‌ చట్ట ప్రకారం నేరమనీ కనుక పాడటం ఆపి వేయమని’ ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తన లాయర్‌ ద్వారా నోటీసులు అందించారు. నోటీసు ఇచ్చినవాడు స్నేహితుడు. పుచ్చుకున్నవాడూ స్నేహితుడే. అనేక విషయాలలో ఇరువురికీ స్నేహం ఉండవచ్చు. కాని ప్రొఫెషనలిజమ్‌లోకి వచ్చేసరికి బహుశా పంతాలూ పట్టింపులూ కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఇక్కడ అదే జరిగి ఉండవచ్చు.
 
సంగీతరంగంలో కాపీరైట్‌దీ, రాయల్టీది కీలకమైన పాత్ర. ఒక పాటను ఒక ఆడియో కంపెనీ కొనుక్కుంటే దాని మీద వచ్చే రాబడిలో సంగీతదర్శకుడికీ, గాయనీ గాయకులకీ రాయల్టీ ఇవాల్సి ఉంటుంది. హెచ్‌ఎంవి వంటి పెద్ద సంస్థలు ఈ రాయల్టీని చెల్లించేవి. గతంలో మహమ్మద్‌ రఫీ, లతా మంగేష్కర్‌లు ఈ రాయల్టీ విషయంలో ఒక కాంట్రవర్సీని లేపారు. ఒకసారి పాట పాడేశాక, దానికి రెమ్యునరేషన్‌ పుచ్చుకున్నాక ఆ తర్వాత రాయల్టీ అక్కర్లేదు అనేది రఫీ వాదన అయితే రాయల్టీ ఉండాలి అనేది లతా వాదన. దీని వల్ల కొంతకాలం పాటు వారిద్దరు కలిసి పాడలేదు కూడా. 
 
పాత పాటలను కొత్త సినిమాలలో వాడుకోవాలంటే అనుమతి తీసుకోవాలి. కొన్ని పాత పాటలను ఉపయోగించి యాడ్స్‌ చేయడం చూస్తుంటాము. వాళ్లు కూడా ఆ పాటలను సొంతదారుల నుంచి కొనుక్కుని ఉపయోగించాల్సిందే. ఏవో మూడు సెకన్లు ఆరు సెకన్లకు అనుమతులు అక్కర్లేదు కాని మొత్తం పాటను ఉపయోగించాలంటే డబ్బు కట్టక తప్పదు. ఇప్పుడు ఇళయరాజా చెబుతున్నది కూడా అదే.
 
బాలూ ఇటీవల బాలూఎట్‌ఫిఫ్టీ పేర ప్రపంచ యాత్ర చేస్తున్నారు. దేశదేశాలలో కచ్చేరీలు ఇస్తున్నారు. ఆ కచ్చేరీలలో అందరి పాటలను పాడుతున్నారు. ఇళయరాజా ఏమంటారంటే ఇవన్నీ ఏ ప్రజాహిత కార్యక్రమం కోసమో ఉచితంగానో చేయడం లేదు కదా... కనుక వీటిలో నేను చేసిన పాటలు మీరు పాడి డబ్బు సంపాదించుకోవడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నిస్తున్నారు. బాలూ కూడా ఎంతో హుందాగా ఇలాంటి చట్టం ఉందని తనకు తెలియదనీ ఇక మీదట చట్టాన్ని గౌరవించి ఇళయరాజా పాటలు పాడనని తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలియచేశారు. 
 
అయితే ఇళయరాజా కేవలం ఇది బాలూ కోసమే చేయలేదని మనం గుర్తు చేసుకోవాలి. సంవత్సరం క్రితం ఆయన అనేక ఎఫ్‌ఎం చానెల్స్, మ్యూజిక్‌ చానల్స్‌కు కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారు. చెప్పా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా తన బాణీలు, అంతర స్వరాలు ఉచితంగా వాడుకుంటున్నారనీ అనుమతి లేకుండా అలాంటి పనులు చేయవద్దనీ ఆయన నోటీసులు ఇచ్చారు. బాలూకు నోటీసు అందుకు కొనసాగింపే.
 
 ఇళయరాజాగారి పాటలు లేకుండా ప్రపంచంలో ఎక్కడా తమిళ, తెలుగు సంగీత విభావరిలు జరగడం లేదు. ఇప్పుడు బాలుగారికి మాత్రమే నోటీసులు వచ్చాయి. మిగతా గాయనీగాయకులు అందరికీ భవిష్యత్తులో నోటీసులు వెళతాయా? ఏమో చూడాలి మరి! రాజాగారు చేసినట్టు మిగతా సంగీత దర్శకులు కూడా చేస్తే గాయనీగాయకుల భవిష్యత్తు అంధకారమే అంటున్నారు గాయని సునీత.. 
 
మరి వీరి బాధ ఎవరు పట్టించుకుంటారు. రాయల్టీ ఇవ్వకుండా పాట పాడటం నేరమైతే పాట కట్టినవారికే కాదు. పాటరాసినవారికి, పాటను వాడుకున్న నిర్మాతకు కూడా రాయితీ ఇవ్వాల్సిందే మరి. సమస్యకు న్యాయమైన పరిష్కారం లభిస్తుందా మరి.