జగనన్న యంగ్ సీఎం.. హీరో సూర్య హ్యాపీనెస్
సూర్య నటించిన ఎన్‌జీకే ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ-తెలంగాణలో కెకెరాధామోహన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. సూర్య సరసన ఈ చిత్రంలో సాయిపల్లవి- రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్‌లో సూర్య ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో జరిగిన తాజా మీడియా సమావేశంలో సూర్య చేసిన ఓ వ్యాఖ్య వేడెక్కించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైయస్ జగన్ ఎవరూ ఊహించని మెజారిటీతో అసాధారణమైన విక్టరీని అందుకుని సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు సూర్య ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జగన్ అన్న విక్టరీ గురించి తెలుసుకున్నాను. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు ఏపీ పాలిటిక్స్ గురించి తెలుసు. ఆయన హెలీకాఫ్టర్ యాక్సిడెంట్‌లో మరణించాక ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పోరాటం గురించి అవగాహన ఉంది.
ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. వన్ సైడెడ్ గెలుపు దక్కింది. అందుకు తగ్గట్టే అతడిపై అతి పెద్ద బాధ్యతను ప్రజలు ఉంచారు. దానిని కొత్త సీఎం జగన్ గారు నెరవేర్చాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద బాధ్యత అని నేను అనుకుంటున్నాను. వైయస్సార్ కుటుంబం నుంచి యంగెస్ట్ సీఎం వస్తున్నారు... అని సూర్య వ్యాఖ్యానించారు.
`జగన్‌ని ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడిని. ఎందుకంటే అనీల్ రెడ్డి నా క్లాస్‌మేట్. అనీల్ రెడ్డి జగన్‌కి కజిన్. చెన్నై వచ్చినప్పుడల్లా అనీల్ రెడ్డి నేను ఐస్‌క్రీమ్ తినేందుకు వెళ్లేవాళ్లం. మా ఇద్దరికీ అదో ఎంటర్టైన్‌మెంట్. అనీల్‌తో ఉన్న స్నేహం వల్ల జగన్ ఫ్యామిలీకి దగ్గరయ్యాను`` అని సూర్య అన్నారు. వైయస్ చనిపోవడం పెద్ద నష్టం. ఆయన పాదయాత్ర ఓ సంచలనం. పదేళ్ల తర్వాత జగన్ పాదయాత్రలు చేసి తిరిగి రాజ్యాధికారం దక్కించుకున్నారు అని సూర్య వ్యాఖ్యానించడం ఆసక్తి రేకెత్తించింది.
కాలేజీ రోజుల నుంచి జగన్ కుటుంబంతో అనుబంధం ఉందని.. జగన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఇదివరకూ చాలా సందర్భాల్లో టీవీ చానెల్ ఇంటర్వ్యూల్లోనూ సూర్య వ్యాఖ్యానించారు. వైయస్ కుటుంబం నుంచి అనీల్ రెడ్డి - సునీల్ రెడ్డి ఇద్దరికీ సూర్య క్లాస్‌మేట్. అప్పటి నుంచి రాజకీయాలకు అతీతంగా వైయస్ కుటుంబంతో సూర్యకు సత్సంబంధాలున్నాయి. జగన్‌ని అన్నయ్య అని పిలుస్తూ సన్నిహితంగా ఉన్నారు. ఇదే విషయాన్ని సూర్య తాజా ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించారు.
ఇదివరకూ ప్రముఖ తెలుగు చానెళ్ల ఇంటర్వ్యూలోనూ ఈ బంధుత్వం- స్నేహం గురించి సూర్య ప్రత్యేకంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తనకు అత్యంత సన్నిహితులు- స్నేహితుల కుటుంబం నుంచి యంగ్ సీఎం వస్తున్నారన్న ఆనందం ఉందని సూర్య తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూలో సూర్య ప్రత్యేకించి `జగనన్న` అంటూ ప్రస్థావించడంపై మీడియాలో వాడి వేడిగా చర్చ సాగింది. ఇక వైయస్ జగన్ విక్టరీతో సూర్యలో చాలా ఆనందం వ్యక్తమవ్వడంపైనా ఆసక్తిగా ముచ్చటించుకున్నారంతా.
-శక్తి