గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (21:49 IST)

ఎన్టీఆర్ ఎలాంటివారో చెప్పిన కల్యాణ్ రామ్...

నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ క‌ళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల‌ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ క‌ళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల‌ 11న  ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా గ్రాండ్‌గా నిర్వ‌హించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ ఎమోష‌న‌ల్ అవ్వ‌డం.. ఊహించ‌ని విధంగా వారి క‌ళ్ల‌ల్లో క‌న్నీరు రావ‌డం అక్క‌డ ఉన్న‌వారంద‌రినీ క‌లిచివేసింది. 
 
ఈ వేదికపై కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... త్రివిక్రమ్- తమ్ముడు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూసాను. నాలానే అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారని తెలుసు. అద్భుతమైన దర్శకుడు - అద్భుతమైన నటుడు కలిస్తే ఎలా ఉంటుందో చిన్న మచ్చుకగా ట్రైలర్ చూపించారు. ట్రైలర్ అదిరింది. ఈ వేళ ఒక విషయం చెప్పాలి. నాన్న గారు ఒక విషయం చెప్పారు అది గుర్తు చేసుకుంటా. 1962 సంవత్సరంలో పొద్దున్నే మేకప్ వేసుకుని షూటింగుకి వెళ్లారు తాత నందమూరి తారక రామరావు గారు. షూటింగులో ఉండగా ఫోన్లో ఒక అశుభ వార్త వినాల్సొచ్చింది. 
 
ఆయన పెద్ద కొడుకు - మా పెదనాన్న నందమూరి రామకృష్ణ కాలం చేశారని.. అది జరిగినప్పుడు ఏ తండ్రీ తట్టుకోలేరు. కానీ ఆయన మేకప్ వేసుకుని లొకేషన్లో ఉన్నారు. నిర్మాతకు నష్టం కాకూడదని.. రోజంతా షూటింగ్ పూర్తి చేసి అప్పుడు వెళ్లారు. చేతికందిన కొడుకు చనిపోతే ఉంటారా..అండీ! అంత గొప్పవారు తాత గారు. వృత్తి ధర్మం. తాత గారు షూటింగులో ఉన్నప్పుడు ముత్తాత లక్ష్మయ్య గారు యాక్సిడెంట్లో మరణించారు. ఆ రోజు కూడా వృత్తికిచ్చిన గౌరవం - నిర్మాతకిచ్చిన కమిట్మెంట్ వల్ల షూటింగ్ చేసి ఇంటికెళ్లారు.
 
1982లో మా బాలయ్య బాబాయ్ పెళ్లి - మా రామకృష్ణ బాబాయ్ పెళ్లి. వారి పెళ్లి జరుగుతుంటే .. నెలరోజుల్లో ఎలక్షన్స్ ఉంటే ఆ ప్రచారంలో ఉండి తాతగారు పెళ్లికే వెళ్లలేదు. ప్రజలకు సేవ చేయాలని నమ్మారు కాబట్టి! ఎవరైనా సొంత కొడుకుల పెళ్లికి వెళ్లకుండా జరిపిస్తారా? పనికి ఇచ్చిన గౌరవం. అలానే వాళ్లమ్మకిచ్చిన మాటతో నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను. కంటికి రెప్పగా కాపాడతానని మాటిచ్చిన మా నాన్నగారు. వాళ్ల తండ్రిగారి ఆఫీస్ బోయ్‌గా  - చైతన్య రథ సారథిగా ఆయన వెన్నంటి ఉండి కొడుకుగా కర్తవ్యాన్ని నెరవేర్చారు. అలాగే ఆగస్టు 29  - 2018 మా ఇంట్లో కూడా ఒక సంఘటన జరిగింది.
 
అది జరిగినప్పుడు అర‌వింద స‌మేత సినిమాకి ఇంకా 30 రోజుల షూటింగ్ చేయాల్సి వుంది. ఈ సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్ అవుతుందా అనుకున్నారు. కానీ.. నిర్మాత బావుండాలి. ఇచ్చిన మాట నిలబడాలి అని ఐదో రోజు తమ్ముడు షూటింగుకి వెళ్లాడు. నాన్ స్టాప్‌గా డే & నైట్ పని చేసాడు. ఈ రోజు ఈ ఆడియోకి రాగలిగాం. మీరందరూ చూస్తున్నారు... అంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. బ్రదర్స్ ఎమోషన్ అందరికీ ఎమోషన్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ... చాలా ఎమోష‌న్ అయ్యాడు. ఓ వైపు క‌న్నీరు వ‌స్తూన్నా... ఆపుకునే ప్ర‌య‌త్నం చేస్తూ మాట్లాడాడు. ఈ నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ఈ విషాదం నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డాల‌ని ఆ భ‌గ‌వంతుడు ధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుందాం.