బస్తీలో 300 మందిపై అత్యాచారం చేసిన మృగం 'కీచక'
యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’కీచక‘. శ్రీ గౌతమి టాకీస్ పతాకంపై ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జోశ్యభట్ల సంగీతం అందించారు. ఈ నెల 30వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ఎన్.వి.బి.చౌదరి మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో తెలుగు చిత్రం విడుదల చేయడం కష్టంగా ఉంది, కష్టాలను అధిగమించి 30న మా 'కీచక' చిత్రం విడుదల చేస్తున్నాం. కొత్త కాన్సెప్ట్, కొత్తగా తీశాం. తెలుగులో ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి.
యదార్థ గాధ ఆధారంగా చిత్రం తెరకెక్కింది. ఫిక్షన్ తక్కువ, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఓ బస్తీలో 300 మంది మహిళలపై అత్యాచారం చేసిన మృగం కథ ఇది. మంచి వ్యక్తుల జీవితాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. మీరు ఇలాంటి కథను ఎందుకు ఎంపిక చేసుకున్నారని కొందరు ప్రశ్నించారు. చెడ్డవాళ్ల జీవితం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. అకుల్ యాదవ్ జీవితం ఓ గుణపాఠం, మహిళలకు స్ఫూర్తినిస్తుంది. కొత్త నిర్మాత కిషోర్ గారు కథ విన్న వెంటనే అంగీకరించారు. ఇలాంటి కథను కఠినంగానే చెప్పాలి. ఇటీవల ఓ 150 మంది ప్రేక్షకులకు చిత్రం చూపించా. 85 శాతం బాగుందన్నారు. కథ, స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా ఉంటుంది" అన్నారు.
నిర్మాత కిషోర్ పర్వతరెడ్డి మాట్లాడుతూ.. "చిత్రంలో అత్యాచార సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. అది నిజమే. కథానుసారం అలా తీయడం జరిగింది. మహిళలకు మద్దతుగా ఈ చిత్రం తీశాం. అత్యాచారానికి గురయిన మహిళలు తిరగబడితే, కీచకులు ఎలా పారిపోతారో చూపించాం. 24 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. 30న సుమారు 100 ధియేటర్లలో విడుదల చేస్తున్నాం. సందేశాత్మక చిత్రమిది" అన్నారు.
చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్న యంవి రావు మాట్లాడుతూ.. "తమిళంలో 'అసురగన్' పేరుతో చిత్రాన్ని అనువదిస్తున్నాం. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్భయ చట్టం వచ్చినా, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతి ఒక్కరికీ హెచ్చరిక కావాలనే ఉద్దేశంతో దర్శక, నిర్మాతలు ఈ కథ తీశారు" అన్నారు.
జ్వాలా కోటి మాట్లాడుతూ.. "మంచి క్లారిటీతో కథ రాసుకుని సబ్జెక్టు ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు చిత్రం తెరకెక్కించారు. నాకు ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. మా అందరికి కృషికి 30వ తీదీన మంచి ఫలితం లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను" అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ కమలాకర్, మాటల రచయిత రాంప్రసాద్ యాదవ్, కృష్ణా జిల్లాలో చిత్రాన్ని పంపిణి చేస్తున్న కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్, మాటలు: రాంప్రసాద్ యాదవ్, నిర్మాత: కిషోర్ పర్వతరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి.