ఏడేళ్ళ నాటి కేసును తిరగదోడారు... చిక్కుల్లో మోహన్‌లాల్ .. దోషిగా తేలితే జైలే
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. ఏడేళ్ళ నాటి కేసును కేరళ పోలీసులు తిరగదోడటంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. గత 2012 సంవత్సరంలో మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసులో ఆయన్ను కోర్టులో హాజరుపరచాలని చూస్తున్నారు.
గతంలో హీరో మోహన్ లాల్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. కె.కృష్ణన్ అయ్యర్ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు వచ్చింది. అపుడు కేరళ ప్రభుత్వం తరపున అడ్వకేట్ తన వాదనలు వినిపించారు. ఆ సమయంలో ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మోహన్ లాల్‌కు కూడా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చేసింది. దాంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం సంచలనంగా మారింది.
మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'కప్పాన్'. తెలుగులో ఈ చిత్రం 'బందోబస్త్' అనే పేరుతో విడుదలైంది. ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో పాటు బిగ్‌బాస్ మలయాళ కార్యక్రమాన్ని కూడా హోస్ట్ చేస్తున్నారు. మోహన్ లాల్.. ఏనుగు దంతం విషయంలో చిక్కుల్లో పడటంతో ఆయన అభిమానులతో పాటు చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. కేసు నిజం అని తేలితే మోహన్ లాల్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.