మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (09:10 IST)

'స్నేహంకోసం' ... 1800 చిన్నారులకు హీరో విశాల్ విద్యాదానం

కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్ హఠాన్మరణం చెందారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, పునీత్ రాజ్‌‍కుమార్ బెస్ట్‌ ఫ్రెండ్స్. అయితే, పునీత్ 1800 చిన్నారులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఇపుడు పునీత్ లేకపోవడంతో ఆ చిన్నారుల చదువులు ఏమైపోతాయనే బెంగ పట్టుకుంది. కానీ, తమిళ హీరో విశాల్ పెద్ద మనస్సుతో ముందుకు వచ్చారు. పునీత్ చదవిస్తున్న ఆ 1800 మంది విద్యార్థులను తాను చదివిస్తానని ప్రటించారు. 
 
విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘ఎనిమి’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి హైదరాబాద్ వేదికగా తాను నటించిన ఎనిమి చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పునీత్ రాజ్‌కుమార్‌లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని, మేకప్, ఉన్నా లేకున్నా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎక్కడైనా ఆయన ఒకేలా మాట్లాడేవారన్నారు. 
 
సమాజానికి పునీత్ ఎంతో చేశారని, ఎంతోమందికి ఉచిత విద్యను అందించడంతోపాటు వృద్ధాశ్రమాల్ని కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఒకే ఒక్క మనిషి ఇన్ని పనుల చేశాడంటే నమ్మలేకున్నానని, ఇప్పటివరకు ఆయన చదివించిన 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని, ఈ విషయంలో పునీత్‌కు మాటిస్తున్నానని చెబుతూ విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.
 
పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, చివరికి తన కళ్లను కూడా దానం చేశారని విశాల్ గుర్తు చేశారు. పునీత్ లేరన్న విషయం నమ్మశక్యం కావడం లేదన్నారు. ఆయన మరణం ఒక్క చిత్ర పరిశ్రమకే కాదని, మొత్తం సమాజానికే తీరని లోటని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలకు తనవంతు సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు.