శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (12:55 IST)

'మయూరి’ సుధకు ‘లెజెండ్’ అవార్డ్

భార‌తీయ నృత్యంలో మ‌యూరి సుధాచంద్ర‌న్‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. యాక్సిడెంట్‌లో కాలు పోయినా, కృత్రిమ కాలు పెట్టుకొని నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయానికి గురిచేసిన గొప్ప నృత్య క‌ళాకారిణి సుధాచంద్ర‌న్‌. వెండితెరపై ఆమె జీవితం ఆవిష్కృతమైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడామె బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటుతున్నారు.
 
ఎంతోమందికి స్ఫూర్తిదాయ‌కంగా నిలిచిన సుధాచంద్రన్‌ను ఇప్పుడు ‘లెజెండ్‘ అవార్డ్ వరించింది. వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బుల్లితెర అవార్డ్స్- 2020 ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొప్పన కృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27న హైదరాబాద్ శిల్పారామం, రాక్ హైట్స్‌లో ఈ వేడుకలు నిర్వహించబడినాయి.
 
బుల్లితెర కళాకారుల ప్రతిభకు తగినట్లుగా ఈ వేడుకలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందచేశారు. ఇక నాట్యమయూరి సుధాచంద్రన్‌ను ఈ వేదికపై ‘లెజెండ్’ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును జీవితా రాజశేఖర్, బాబుమోహన్, శివాజీరాజా, అంబికా కృష్ణలు.. సుధాచంద్రన్‌కు అందజేశారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసి ఘనంగా సత్కరించిన వారందరికీ సుధాచంద్రన్ ధన్యవాదాలు తెలిపారు. పలు సీరియల్స్‌లో ఉత్తమ నటనను కనబరిచిన నటీనటులను ఈ అవార్డులు వరించాయి.