మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (18:15 IST)

గేయ రచయిత వెన్నెలకంటి ఇకలేరు...

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నలకంటి మంగళవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నైలో ఆయన మృతి చెందారు. వెన్నెలకంటి అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎన్నో సినిమాలకు ఆయన ఆణిముత్యాల వంటి పాటలను అందించారు. ఆయన మృతి వార్తతో సిని పరిశ్రమ షాక్‍కు గురైంది.
 
సినీ ప్రముఖుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కుమారుడు శశాంక్ వెన్నెల కంటి కూడా సినీ రచయితగా ఉన్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల కోసం దాదాపు 2 వేలకు పైగా పాటలను ఆయన రచించారు. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంలో ఆయన పేరుగాంచారు.
 
కాగా, తెలుగు సినీ గేయ రచయితల్లో వెన్నెలకంటి ప్రముఖ స్థానం ఉంది. స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన ఆయన నాటకాల నుండి సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1989లో వచ్చిన ‘శ్రీరామచంద్రుడు’ చిత్రంతో గేయ రచయితగా మారిన ఆయన ఆ తర్వాత వందల సినిమాలకు పాటలు రాశారు.
 
‘స్వాతికిరణం, ఆదిత్య 369, అల్లరి ప్రియుడు, భైరవ ద్వీపం, ముగ్గురు మొనగాళ్లు, మహర్షి, ఏప్రిల్ 1 విడుదల, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. అన్నయ్య, శీను, టక్కరి దొంగ, ఆవారా’ లాంటి అనేక హిట్ సినిమాలకు సూపర్ హిట్ పాటలను అందించారు ఆయన. 
 
దాదాపు ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోలందరికీ పాటలు రాసిన ఘనత ఆయనది. పాటలే కాదు తెలుగు అనువాద చిత్రాలకు మాటలు కూడ రాసేవారు ఆయన. ముఖ్యంగా తమిళం నుండి తెలుగులోకి అనువదించబడే సినిమాలకు మాటలు రాయాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన కుమారుడు శశాంక్ వెన్నెల కంటి తెలుగు అనువాద చిత్రాలకు పనిచేస్తున్నారు.