టాలీవుడ్‌లో "మా" రచ్చ రచ్చ : కాక పుట్టిస్తున్న ఎన్నికలు
తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలు సెప్టెంబరులో జరగాల్సి ఉండగా.. మూడు నెలలు ముందే నుంచే వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా మారింది.
ఈ ఎన్నికలపై సోషల్ మీడియాలోనూ వాడీ-వేడి చర్చలు జరుగుతున్నాయి. గతంలో కంటే ఈసారి 'మా' ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇప్పుడు మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది.
ఈ ఐదుగురులో ప్రకాశ్‌రాజ్ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే సినీ పెద్దల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఆయన్ను అడ్డుకునేందుకు నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. చివరకు ఇది టీ కప్పులో తుఫానులా సద్దుమణిగిపోయింది.
ఈ క్రమంలో నటుడు మురళీమోహన్ మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మా ఎన్నికలు ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందంటూ బాంబు పేల్చారు. దీంతో అసలు పోటీ ఉంటుందా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ ఎప్పుడు ? #Justasking అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మాలో మరోసారి హీట్ పెంచేశాయి. ఇందుకు బదులుగా మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ కౌంటర్ రిప్లై ఇచ్చారు. 'జనరల్ బాడీ మీటింగ్‌లో ఎన్నికలపై ఒక తీర్మానం చేద్దామనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా జనరల్ బాడీ మీటిగ్ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా ఎన్నికలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాం. మెయిల్ కూడా పంపించాం. ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇది నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్‌లో దూకుతాను అన్నట్టుగా ఉంది. మా నిర్ణయం వచ్చేవరకు వెయిట్ చేయండి సార్' అంటూ నరేష్ ఘాటు రిప్లై ఇచ్చారు.
అలాగే, ఏప్రిల్ 12న ఇదివరకే ప్రకాష్‌రాజ్‌కి పంపిన లేఖను కూడా నరేష్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇలా ప్రకాష్ రాజ్, నరేష్‌ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. మరోవైపు, మంచు విష్ణు కూడా తెరవెనుక తనకు మద్దకు కూడగట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.