`మా` ఎన్నికలు సరే - థియేటర్ల సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్న ఎగ్జిబిటర్లు!
ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో `మా` ఎన్నికల సందర్భంగా సినీ పెద్దలు అందరూ వచ్చి దానిపై చర్చలో పాల్గొన్నారు. ఇది ఓకే. మరి హీరోల సినిమాలు ప్రదర్శించాలంటే థియేటర్ల సంగతి ఏమిటి? వాటిపై ఎవరూ అడగరా? మా సంగతేమిటంటూ పలువురు ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రలో చాలా చోట్ల థియేటర్లు మూసేసి కళ్యాణ మండపాలుగా మార్చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాలలో పరిస్తితి మరీ దారుణంగా వుంది.
ఫంక్షన్ హాల్స్‌గా మారిపోతున్నాయి
కాకినాడలో 22, రాజమండ్రిలో 16, పిఠాపురం, మండపేట, అమలపురం మొదలైన ప్రాంతాలలో దాదాపు 140 థియేటర్లు నడుస్తున్నాయి. అదేవిధంగా మిగిలిన ప్రాంతాలలో కూడా వందల సంఖ్యలో థియేటర్ల వున్నాయి. తెలంగాణాలోనూ థియేటర్లు వున్నాయి. మల్టీప్లెక్స్‌లు వున్నాయి. ఒక్కో థియేటర్ల నిర్వహణకు దాదాపు 6 లక్షలు విద్యుత్ ఛార్జీలు, సిబ్బంది వేతనాకలు ఖర్చవుతుంది. సాధారణ రోజుల్లో వచ్చిన ఆదాయం ఇటుఇటూగా సరిపోతుంది. ఇదే పరిస్థితి రెండు రాష్ట్రాలలో వుంది. దీనిపై దృష్టి పెట్టాలని పలువురు ఎగ్జిబిర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఆంధ్ర సి.ఎం. ఆంధ్రలో విద్యుత్‌పై కొంత రాయితీ ఇచ్చారు. కానీ ఇప్పటి పరిస్థితి గురించి మాట్లాడడంలేదు. రాజకీయాంశాలు ఇతరత్రా అంశాలు మినహా ప్రేక్షకుడికి థియేటర్ సమస్యల గురించి ఆలోచించే తీరికలేదు. ఇటీవలే చిరంజీవిగారు ఆంధ్ర సి.ఎం. పనితీరును మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనే పెద్ద దిక్కుగా వుండి ఆంధ్రలో థియేటర్ ఓపెన్ కావడానికి సహకరించాల్సింది మల్లికార్జున అనే థియేటర్ యాజమాని తెలియజేస్తున్నారు. ఇటీవలే ఎగ్జిబిటర్లు లిఖితపూర్వకంగా ఆంధ్ర, తెలంగాణా ఫిలింఛాంబర్‌కు లేఖలు రాశారు.
ప్రస్తుతం షూటింగ్‌లలో అందరూ బిజీగా వున్నారు. జులై నుంచి చిన్న, పెద్ద సినిమాలు షూటింగ్‌లు జరుపుతున్నారు. మరి థియేటర్లు ఓపెన్ కాకపోతే అందరూ ఒకేసారి విడుదల చేయాలంటే చాలా కష్టమైన పని. పెద్ద సినిమాలకు థియేటర్లు దొరికినా చిన్న సినిమా నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు వివరంగా తెలియజేశారు.
రాయితీలు ప్రకటించాలి
ఇదేకాకుండా, థియేటర్లకు కొన్ని రాయితీలు ప్రభుత్వం ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడున్న కరోనా వల్ల థియేటర్ల మెయిన్టెన్స్‌కు అదనంగా ఖర్చు పెట్టాల్సివస్తుంది. కనుక పన్ను రాయితీలో మినహాయింపు, పార్కింగ్ సమస్య, టికెట్ రేటు విషయంలో వెసులుబాటు ఎగ్జిబిటర్‌కు వుండేలా చేయాలని వారు తమ డిమాండ్లలో పేర్కొన్నారు. ఇవి గతంలోనూ వారు ఛాంబర్ దృష్టికి తెచ్చారు. అయితే జులై నుంచి థియేటర్లు ఓపెన్ అవుతాయనే భ్రమలో చాలామంది వున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ మా సమస్యలు పరిష్కారం కాకుండా థియేటర్ల ఓపెన్ చేయడం కుదరదని విజయవాడలో ప్రముఖ ఎగ్జిబిటర్ ప్రసాద్ తెలియజేస్తున్నారు. కనుక దీనిపై సినీ పెద్దలు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.