మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (17:26 IST)

ఓవర్సీస్ రైట్‌ల బయ్యర్ల కళ్లు బైర్లు కమ్మేలా మహేష్ 'మహర్షి' రేట్లు...

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే మామూలుగానే బాగా కాస్ట్లీ... అందులో రెమ్యూనరేషన్ మొదలు నిర్మాణం, ప్రమోషన్స్, రిలీజ్ ఇలా ప్రీ ప్రొడక్షన్స్ నుండి పోస్ట్ ప్రొడక్షన్స్ వరకూ ఆన్నీ చాలా భారీగానే ఉంటాయి. తాజాగా మహేష్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25వ సినిమా ‘మహర్షి’ చిత్రాన్ని దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీల వంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారంటే ఈ చిత్రంలోని భారీతనం గురించి మరింకేమీ చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు.
 
‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తరువాత సక్సెస్‌ఫుల్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే ‘మహర్షి’ సినిమా మే 9వ తేదీన భారీ విడుదలకు సిద్ధమైపోయింది. విడుదలకు ముందే ఈ చిత్రంపై విపరీతమైన పాజిటివ్ బజ్ ఉండటంతో దానిని క్యాష్ చేసుకునేందుకు ‘మహర్షి’ నిర్మాతలు కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. 
 
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి మార్కెట్ ఉన్న మహేష్‌ సినిమాలలో బ్రహ్మోత్సవం, స్పైడర్‌లు భారీ డిజాస్టర్‌లుగా ఆయన మార్కెట్‌ని దెబ్బకొట్టగా భరత్ అనే నేను సినిమాతో తిరిగి తన పూర్వవైభవాన్ని అందుకున్నారు. దీంతో ‘మహర్షి’ చిత్రాన్ని ఓవర్సీస్‌లో భారీ రేటులో సేల్ చేయడానికి నిర్మాతలు చెప్పిన మొత్తం విని అక్కడి బయ్యర్ల కళ్లు బైర్లు కమ్మాయట.
 
ఈ చిత్రానికి ఏకంగా రూ.18 కోట్లు ఓవర్సీస్ రైట్స్ చెప్పడంతో బయ్యర్లు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. మహేష్‌కి ఓవర్సీస్‌లో క్రేజ్ ఉన్నమాట వాస్తమమే.. అయినప్పటికీ మరీ రూ.18 కోట్లు పెట్టడం అంటే సాహసమే అవుతుందనేది వారి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అయితే రెట్టింపు వసూళ్లు రాబట్టేయవచ్చు కానీ.. యావరేజ్ టాక్ వచ్చినట్లయితే ఈ మొత్తాన్ని రాబట్టడం కష్టమే అవుతుంది. ఈ తరుణంలో నిర్మాతల త్రయంతో బేరాలు మొదలు పెట్టారట ఓవర్సీస్ బయ్యర్లు. రూ.12 నుండి రూ.13 కోట్ల వరకూ ఓవర్సీస్ బేరాలు సాగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.