మలయాళ చిత్రపరిశ్రమలో విషాదం - ప్రముఖ నటుడు కుందర జానీ మృతి
మలయాళ చిత్రపరిశ్రమలో విషాదం జరిగింది. ప్రముఖ నటుడు కుందర జానీ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. మంగళవారం సాయంత్రం సమయంలో ఆయనకు హఠాత్తుగా చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కొల్లాంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు.
కాగా, తన కెరీర్‌లో వందకుపైగా చిత్రాల్లో నటించిన జానీ 1979లో నిత్యవసంతంలో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసారు. "అగ్నిపర్వతం, రాజావింటే మకన్, అవనాజి, నాడోడిక్కట్లు" చిత్రాల్లో పోషించిన పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కిరీడం, చెంకోల్, స్పదికం తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గత 2010 సంపత్సరంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన రౌడీయిజం నశించాలి అనే చిత్రంలో ఆయన నటించారు. ఇక ఉన్న ముకుందన్ ప్రధాన పాత్రను పోషించిన మెప్పడియాన్ చిత్రంలో ఆయన చివరిసారిగా తెరపై కనిపించారు.