సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2024 (16:05 IST)

మోహన్ లాల్‌కు తీవ్ర జ్వరం.. నిలకడగా ఆరోగ్యం

mohan lal
మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత, కండరాల నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన చికిత్స పొందుతున్న అమృతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు చెప్పినట్టు సమాచారం. 
 
నిజానికి మోహన్ లాల్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల చేర్పించారని సమాచారం. మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నటుడికి వైద్యులు సూచించినట్టు తెలిసింది. 
 
మోహన్‌లాల్‌ హెల్త్‌ బులెటిన్‌ అంటూ ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది. ఆ మెడికల్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన తేదీ ఆగస్టు 16గా ఉండడం గమనార్హం. దీన్ని చూసిన పలువురు అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది.
 
తన కొత్త సినిమాలు ‘ఎల్‌ 2’, ‘బరోజ్‌’ పనుల్లో భాగంగా గుజరాత్‌ వెళ్లిన మోహన్‌లాల్‌.. అక్కడే అనారోగ్యానికి గురికాగా కొన్ని రోజుల క్రితం కొచ్చి వచ్చారని సినీ వర్గాల సమాచారం. స్వీయ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘బరోజ్‌’ అక్టోబరు 2న విడుదల కానుంది. ఈయన హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘ఎల్‌ 2: ఎంపురన్‌’. చిత్రీకరణ దశలో ఉంది.