బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (19:18 IST)

వసుధ ఫౌండేషన్ సౌజన్యంతో-'మనం సైతం' భారీ వితరణ!!

poonam kaur
'ఆపన్నుల పాలిట అభయ హస్తం'గా మారిన కాదంబరి సారధ్యంలోని 'మనం సైతం' కరోనా కాలంలో తన సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడం తెలిసిందే. ఇప్పటికే వేలాదిమందికి ఉచితంగా వంట సరుకులు అందించిన 'మనం సైతం' తాజాగా 230 మందికి నగదు సహాయం చేసింది. ఇందుకు వదాన్యులు మంతెన వెంకట రామరాజువారి 'వసుధ ఫౌండేషన్' బాసటగా నిలిచింది. 
 
సినిమా రంగ కార్మికులతోపాటు.. అనేకమంది నిరుపేదలు ఈ నగదు సహాయం అందుకున్నారు. ప్రఖ్యాత దర్శకులు వి.వి.వినాయక్, ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కాదంబరి చేస్తున్న నిస్వార్థ సేవను తమ వంతుగా మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో.. మనం సైతంకు 'వసుధ ఫౌండేషన్' చేయూత అందిస్తోందని మంతెన వెంకట రామరాజు అన్నారు. 
 
నగదు సహాయం అందించడం చాలా గొప్ప విషయమని వి.వి.వినాయక్ ప్రశంసించారు. కాదంబరి కృషిని కొనియాడిన పూనమ్ కౌర్ చేతుల మీదుగా.. మనం సైతం కార్యాలయం వద్ద మొక్క నాటించారు. 'నగదు సహాయం అందుకున్నవాళ్ళు అశీర్వదించండి... అందనివాళ్ళు అందాక ఆగండి. తదుపరి విడతలో తప్పక అందిస్తాం' అని పేర్కొన్న కాదంబరి.. మంతెన వెంకట రామరాజు, వి.వి.వినాయక్, పూనమ్ కౌర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 
Manam Saitham
 
ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, జిబిజి రాజులతోపాటు.. మనం సైతం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించారు.