శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (19:37 IST)

పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కు మెగాస్టార్ రెండు లక్షల సాయం

Ponnambalam
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనకు రెండు లక్షల రూపాయలు సహాయం చేశారని తెలుసుకున్న పొన్నాంబళం చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు తదితర చిత్రాల్లో పొన్నాంబళం నటించారు. ఆయా సినిమాల్లో వీరిద్దరి మధ్యా జరిగే ఫైట్స్ ను అప్పట్లో జనం తెగ ఎంజాయ్ చేశారు.
 
చిరంజీవి అన్నయ్యా.. మీ సాయం మరువలేను: పొన్నాంబళం
 
తన ఆరోగ్యం కుదుటపడటం కోసం చిరంజీవి నుంచి సాయం అందిందని తెలియగానే పొన్నాంబళం ఫోన్ ద్వారా తన  కృతజ్ఞతలు తెలిపారు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం,  చాలా ధన్యవాదాలు అన్నయ్యా... నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరున్న ఆ దేవుడు ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటూ, జై శ్రీరామ్‌’ అంటూ తన సందేశాన్ని  తమిళంలో వీడియో రూపంలో పంపారు పొన్నాంబళం.