1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (16:52 IST)

భక్త కన్నప్ప పురాణ కథ కామిక్ రూపంలో విడుదల చేసిన విష్ణు మంచు

Mohan Babu's family in Kannappa' comic book release
Mohan Babu's family in Kannappa' comic book release
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె పూర్తి చేశారు.  ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. వెండితెరను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్‌ను ఆవిష్కరించాడు విష్ణు మంచు. తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న "కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1"ని లాంచ్ చేశారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 
 
"కన్నప్ప కామిక్ బుక్ వాల్యూమ్ 1" ద్వారా భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలుస్తాయి. ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక  భావనలను చూపించనున్నారు. ఈ కామిక్ పుస్తకంతో విష్ణు మంచు భక్త కన్నప్ప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంస్కృతిక వారసత్వంతో వినోదాన్ని మిళితం చేయడం ద్వారా, కన్నప్పపై ఆసక్తిని రేకెత్తించడానికి, కన్నప్ప పట్ల భక్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించారు.
 
Mohan lal with mohanbabu
Mohan lal with mohanbabu
కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1" విడుదల అనేది భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మాత్రమే కాకుండా, కన్నప్ప కథపై విష్ణు మంచు నిబద్ధతను కూడా ప్రదర్శించింది. ఇన్ స్టాగ్రాంలో DM చేసిన వారికి, వారి చిరునామాను మెసెజ్ చేసిన వారికి ఉచితంగా పుస్తకాలు అందుతాయి.
 
ఈ మేరకు విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ఈ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. కామిక్ పుస్తకం.. సినిమా లానే ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నాను. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. 
 
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ , డ్యాన్స్ మాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
 
డాక్టర్ మోహన్ బాబు గారి జన్మదిన వేడుకలు, మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు డా. మోహన్‌లాల్ గారు గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేయగా, శ్రీ ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు.