ఆరోజు మా నాన్న చెప్పుతో కొడ‌తాన‌న్నారు: అల్లు శిరీష్‌

allu sirish
శ్రీ| Last Modified బుధవారం, 15 మే 2019 (14:48 IST)
అల్లు శిరీష్ తాజా చిత్రం ABCD. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో శిరీష్ మాట్లాడుతూ... ఈ సినిమా మలయాళంలో చూసినప్పుడు నా పర్సనల్ లైఫ్ స్టోరీలా అనిపించింది. హీరో, అతని తండ్రి పాత్రలు చూసినప్పుడు వీటితో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది అనిపించింది. మా నాన్నగారు కూడా గుర్తొచ్చారు. ఎందుకంత పర్సనల్‌గా కనెక్ట్ అయ్యానంటే.. ఈ సినిమాలో ఎలాంటి లక్ష్యంగా లేకుండా, డబ్బు విలువ తెలియకుండా అల్లరిచిల్లరగా తిరిగే కొడుకును మార్చడానికి తండ్రి తపన పడుతూ ఉంటాడు.

నేను కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు మా నాన్న పడే తపన నాకు గుర్తుకొచ్చింది. నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్లాను. డాడీ.. బన్నీకి, చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కార్లు కొనిచ్చావ్, ఇప్పుడు నాకు 21 ఏళ్లు వచ్చాయి ఒక కారు కావాలి అని అడిగాను. సరే, ఏం కారు కావాలి అని నాన్న అడిగారు. నాకు మస్టాంగ్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి అని అడిగాను. వెంటనే చెప్పుతో కొడతానన్నారు. నీ వయసు కుర్రోళ్లు ప్రజా రవాణాను వాడుకుంటూ లేదా టూ వీలర్స్‌పై తిరుగుతూ జాబ్ చేసుకుంటున్నారు.

నీకు కారు కొనివ్వడమే ఒక లగ్జరీ. అలాంటిది నువ్వు స్పోర్ట్స్ కార్ అడుగుతున్నావ్. అసలు నీకు డబ్బు విలువ తెలుస్తోందా అని అడిగారు.ఈ ఫాదర్లంతా ఇంతే... ఏదడిగినా ఏదో లెక్చర్ పీకుతారు అనుకున్నాను. అలిగాను. దీంతో మా నాన్న ఒక కారు కొనిస్తానన్నారు. కొంత బడ్జెట్ చెప్పారు. నేను ఇగోకి పోయి నాకేమీ వద్దు నేనే కొనుక్కుంటా అని సవాల్ విసిరాను. కట్ చేస్తే నాకు నేనుగా కారు కొనుక్కోవడానికి మూడేళ్లు పట్టింది. అప్పటికీ నేను మస్టాంగ్ జీటీ కొనుక్కోలేకపోయాను.

నేను సంపాదించిన డబ్బుతో మిత్సుబిసి ఔట్‌లాండర్ కొనుక్కోగలిగాను. ఒకవేళ నేను ఆ రోజు అడిగినప్పుడు మా నాన్న ఆ కారు కొనిచ్చుంటే నాకు నిజంగా డబ్బు విలువ తెలియకపోయేది. సొంతంగా సంపాదించిన డబ్బుతో కారు కొనుక్కుంటే దాని నుంచి వచ్చే కిక్, సంతృప్తి మరో స్థాయిలో ఉంటుంది అని తన అనుభవాన్ని తెలియ‌చేసారు శిరీష్.దీనిపై మరింత చదవండి :