శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (18:37 IST)

'ఓం నమో వేంకటేశాయ'తో టాలీవుడ్ 'మన్మథుడు' వారిద్దరికి షాక్ ఇస్తారా?

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం "ఓం నమో వేంకటేశాయ". 'అన్నమయ్య', 'రామదాసు' వంటి భక్తిరస చిత్రాలతో తెలుగు

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం "ఓం నమో వేంకటేశాయ". 'అన్నమయ్య', 'రామదాసు' వంటి భక్తిరస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆలరించిన నాగార్జున.. ఇపుడు శ్రీవారి భక్తుడిగా వెండితెరపై కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఓం నమో వేంకటేశాయ చిత్ర భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలనుంది. 
 
ఇదిలావుండగా, దశాబ్దం క్రితం వరకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు చక్రం తిప్పారు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం.. బాలయ్య, నాగ్‌, వెంకీలు ఆ స్థాయి విజయాలు సాధించలేకపోవడంతో ఆ తరం ప్రభ కాస్త తగ్గిపోయింది. ఈ తరుణంలోనే పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, జూ.ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలు స్టార్‌లుగా ఎదిగారు. వీరు నటించిన చిత్రాలు సరికొత్త బాక్సాఫీస్‌ రికార్డులను నెలకొల్పాయి. 
 
అయితే, ఇటీవల మళ్లీ వెటరన్‌ హీరోలు సత్తా చాటారు. దశాబ్దకాలంగా "ఖైదీ నంబర్ 150"తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి చిత్రం మళ్లీ మెగా పవర్‌ను చూపించాడు. ఇక, చారిత్రక కథతో వెండితెరపైకి వచ్చిన బాలయ్య కూడా రికార్డు కలెక్షన్లనే రాబట్టాడు. బాలయ్య కెరీర్‌లోనే బెస్ట్‌ కలెక్షన్స్‌ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సాధించింది.
 
ఇక, మిగిలింది నాగార్జున, వెంకటేష్‌. 'అన్నమయ్య' వంటి అద్భుత దృశ్యకావ్యం తర్వాత నాగ్‌ చేసిన మరో వేంకటేశ్వరుని భక్తిని కథ 'ఓం నమో వేంకటేశాయ'. ఈ సినిమా తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిలిమ్‌ అని నాగార్జున చెప్పుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా జాతకం మరో 24 గంటల్లో తేలిపోనుంది.
 
ఇక, మరో వెటరన్‌ హీరో వెంకటేష్‌ చేసిన 'గురు' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా సమ్మర్‌కు వాయిదా పడింది. ఇది హిందీలో విజయవంతమైన 'సాలా ఖాడూస్‌' సినిమాకు రీమేక్‌. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని వెంకటేష్‌ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ ఇద్దరు వెటరన్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలకు ధీటైన పోటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సివుంది.